పోలవరం ముంపుపై చర్చ ఏది..?

– ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు రాని భద్రగిరి ముంపు సమస్య
– గత ప్రభుత్వ హయాంలో సీడబ్ల్యుసీ అధికారులు ఇచ్చిన నివేదికను
– పరిగణలోకి తీసుకొని రేవంత్‌ సర్కార్‌
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంపు నుండి కాపాడకుండా ఐదు పంచాయతీల కోసం కమిటీ వేయడంలో ప్రయోజనం ఏమిటి…? మునిగిపోతున్న రామయ్యకు పురుషోత్తపట్నం భూములు అప్ప చెబితే వచ్చే ఫలితం ఏమిటి..?, ప్రస్తుతం భద్రాచలం పట్టణ ప్రజల మధ్యలో మెదులుతున్న అంశాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలం భవిష్యత్తుపై నీలిమబ్బులు కమ్ముకుంటున్న తరుణంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంపై ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్న ఆశలు గోదావరి పాలవుతున్నాయని స్పష్టమవుతుంది. 2022లో వచ్చిన వరదలకు భద్రాచలం పట్టణం చిగురుటాకులాగా వనికిపోయిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్‌ డ్యాం నిర్మిస్తేనే భద్రాచలానికి ఆ స్థాయిలో ముంపు వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తి అయితే దక్షిణయోక్తిగా పేరుగాంచిన భద్రాద్రి క్షేత్రం భవిష్యత్తు ఏమిట అన్న చర్చలు సాగిన తరుణంలో అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోలవరం ముంపుపై ఇంజనీర్ల బృందంతో సర్వే చేయించి నివేదిక తయారుచేసిన విషయం తెలియంది కాదు. అప్పటి ఇంజనీర్ల బృందం తేల్చిన స్పష్టమైన అంశాలు పోలవరం బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలం పట్టణానికి పెను ప్రమాదం తప్పదని ప్రాజెక్టు పూర్తయితే సాధారణ రోజులలో భద్రాచలం వద్ద 45 అడుగుల మేర గోదావరి నీరు నిలువ ఉండటంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో ఆ స్థాయి 70 నుండి 80 అడుగుల వరకు ఉండవచ్చు అని సీడబ్ల్యూసీ ఇంజనీర్‌ అధికారులు తేల్చి చెపుతూ ముంపు నుండి కాపాడాలంటే ప్రస్తుతం ఉన్న కరకట్టాను ఎత్తు వెడల్పు పెంచేందుకు రూ.1000 కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అప్పటి ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం ఈ ప్రాంత భద్రతపై మరోసారి భయాందోళనలు మొదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అవసరాల రిత్యా గతంలో పోలవరం ప్రాజెక్టుపై నిర్లక్ష్య వైఖరి వహించిన కేంద్రం పెద్దలు ఈసారి అందుకు భిన్నంగా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పూర్తిగా సహకరిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొక మూడు, నాలుగు సంవత్సరాలు లోపే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు సర్కారు కూడా ఇప్పటికే అధికారులతో సమీక్షలు నిర్వహించి పూర్తిస్థాయి నివేదికలతో కేంద్రం పెద్దలను కలిసిన విషయం కూడా తెలియంది కాదు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగి శరవేగంతో పూర్తవుతుందని విషయం తెలిసినప్పటికీ ప్రాజెక్టు ప్రభావంతో ముంపునకి గురయ్యే గ్రామాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ఆరో తారీకు జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో సైతం ఐదు పంచాయతీలతో పాటు ఆస్తుల పంపకం ఇతర విషయాలనే చర్చించడంతో భద్రాద్రి రామయ్యకు ముంపు గండం తప్పదని స్పష్టమవుతుంది. ఇప్పటికే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య పై కేంద్ర ప్రభు త్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తున్న తరుణంలో పోలవరం ముంపు నుండి భద్రాద్రిని కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా అన్నది ఇప్పుడు తలెత్తు తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేంద్ర అనుకూల ప్రభుత్వం కాబట్టి పోలవరం నిధులు రాపట్టు కోవడంలో పెద్ద కష్ట సాధ్యం కాకపో వచ్చు అదే తరుణంలో తెలంగాణలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్‌ సర్కార్‌ కనీసం ముంపుపై పోరాడటానికి కూడా సిద్ధంగా లేరని మొన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో స్పష్టమైనది. గత ప్రభుత్వంలో ఇంజనీరింగ్‌ అధికారులు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసి పోలవరం బ్యాక్‌ వాటర్‌ నుండి భద్రాచలం పట్టణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందించకపోతే ఐదు పంచాయతీలపై కమిటీ వేసిన ప్రత్యేక ప్రయోజనం ఏమి ఉండదని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ముంపు నుండి భద్రగిరిని కాపాడాలి 
2022లో వచ్చిన వరదల ప్రభావాన్ని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. కాపర్‌ డ్యాం పూర్తయితేనే ఈ స్థాయిలో వరద వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పూర్తయితే భద్రాచలం పట్టణం జల సమాధి కావటం ఖాయం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పోలవరం ముంపుపై చర్చించకపోవడం శోచనీయం. పోలవరం ముంపుపై సీపీఐ(ఎం) మొదటి నుండి చెబుతున్నదే నిజమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రంపై పోరాటాన్ని ప్రారంభించాలి. పోలవరం ముంపుపై మలిదశ ఉద్యమానికి పార్టీ కార్యచరణ రూపొందిస్తుంది.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి
గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను రేవంత్‌ సర్కార్‌ పరిగణంలోకి తీసుకోవాలి
రాజకీయాలను పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్‌ అధికారులు పోలవరం ముంపుపై ఇచ్చిన నివేదికలను ప్రస్తుత రేవంత్‌ సర్కార్‌ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ముంపు నుండి భద్రాచలం పట్టణాన్ని కాపాడేందుకు కార్యచరణ రూపొందించాలి. బ్యాక్‌ వాటర్‌ నుండి భద్రాచలం పట్టణానికి కాపాడాలంటే ప్రస్తుతం ఉన్న కరకట్టాను పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ భద్రాద్రి రామయ్యను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం పైనే ఉంది. ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం ఈ విషయంపై స్పష్టమైన పోరాటాలకు నాయకత్వం వహించాలి. ప్రభుత్వం సరైన రీతులో స్పందించకపోతే బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో కలిసివచ్చే అన్ని శక్తులు కలుపుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాన్ని రూపొందిస్తాం.
– బీఆర్‌ఎస్‌ భద్రాచలం నాయకులు ఆకోజు సునీల్‌ కుమార్‌

Spread the love