న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ రాజ్ కొనసాగుతోంది. గవర్నరు కార్యాలయ ఆదేశాలను పాటించలేదనే అభియోగాలతో కొల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్, డిసిపి ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్రమ శిక్షణా చర్యలకు దిగింది. గవర్నర్ కార్యాలయంపై అవాస్తవాలను ప్రచారం చేయడమే అందుకు కారణమని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చెందిన అధికారులు పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. సిపి, డిసిపిలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని.. అందుకు గల కారణాలను వివరిస్తూ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కేంద్ర మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి అసెంబ్లీలో ప్రతిపక్ష (బిజెపి) నేత సువేందు అధికారి తనను కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసు సిబ్బంది వారిని అనుమతించలేదు. రాజ్‌భవన్‌లో పోలీసు సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ ఆదేశాలను లెక్క చేయడం లేదని పేర్కొన్నారు. వారి ప్రవర్తన ఆల్ ఇండియా సర్వీసెస్ నియమాలు, ప్రోటోకాల్ మాన్యువల్‌కు అనుగుణంగా లేవని గవర్నర్ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ.. ఆ ఇద్దరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీలు పేర్కొనడం గమనార్హం.