నవతెలంగాణ-నసురుల్లాబాద్
భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి టి. దయానంద్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాల పరిశుభ్రత, మొక్కల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బొమ్మన్ దేవ్‌పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందిస్తూ ఇంటి వద్ద నాటాలని వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సకాలంలో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. వాతావరణ మార్పుల కారణంగా విష జ్వరాలు ప్రబలుతున్నారని, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది కృషి చేయాలన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి గ్రామాల్లో సేవలందించాలన్నారు, సమయపాలన పాటించని సిబ్బంది, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పచ్చదనం పెంచేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. పాఠశాల టీచర్లు సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యకాంత్, వివిధ గ్రామాల కార్యదర్శులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.