– ఈసీని హెచ్చరించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే తమ ఫిర్యాదులపై విచారణ కోసం న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని, కోర్టును కూడా ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను శుక్రవారం హెచ్చరించింది. హర్యానా ఎన్నికల్లో అక్రమాలపై తమ ఫిర్యాదులను ఈసీ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. తటస్థంగా ఉంటడం అనే అనే లక్షణాన్ని కూడా ఈసీ వదులుకుందని కాంగ్రెస్ మండిపడింది. తమ ఫిర్యాదులను ఇసి తిరస్కరించడం మొత్తం ఫలితాల విశ్వసనీయతపై అనుమానం వ్యక్తమవుతుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది. ఈ లేఖపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెసి వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, భూపీందర్ హుడా, జైరాం రమేష్, పవన్ ఖేరా, అజరు మాకెన్, అభిషేక్ సింఘ్వీ, ఉదరు భాన్, పర్తాప్ బజ్వా అనే తొమ్మిది మంది సంతకాలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై ఇసి ప్రతిస్పందననను జాగ్రత్తగా అధ్యయనం చేశాం. హర్యానా ఎన్నికలకు ఈసీ క్లీన్చిట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈసీ ప్రతిస్పందనపై స్పందించాలని మేం ముందుగా అనుకోలేదు. అయితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈసీ ఉపయోగించిన భాష, కాంగ్రెస్‌పై ఇసి చేసిన ఆరోపణలు మమల్ని స్పందించేవిధంగా చేశాయి’ అని లేఖలో నాయకులు పేర్కొన్నారు. అలాగే, తమ ఫిర్యాదులపై ఈసీ ఇచ్చిన ప్రత్యుత్తరం అణిచివేసే స్వరంలో ఉందని విమర్శించారు. ఇసి తటస్థత అనే లక్షణాన్ని వదిలివేసుకుంటుందనే అభిప్రాయం కలుగుతోందని, నిర్ణయాలను తీసుకోవాల్సిన వ్యక్తులు ఫిర్యాదులు చేసే పార్టీపై దాడి చేయరని లేఖలో కాంగ్రెస్ నాయకులు లేఖలో అన్నారు.