ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
గంజాయి బ్యాచ్… హౌలే గాడు… పంది… దొంగ… లంగ..నీ బొంద…ఏం చేస్తావ్ బే… ఛీ వినడానికే అసహ్యంగా ఉన్నాయి. వాటిని రాయాలంటే అక్షరాలూ సిగ్గుపడుతున్నాయి. కానీ విషయం చెప్పడానికి తప్పట్లేదు. ఇన్నాళ్లు ఈ తరహా పిచ్చి కూతలు పొరుగురాష్ట్రంలోనే ఉండేవి. ఇప్పుడు తెలంగాణలోనూ వినిపిస్తున్నాయి. ఈ కూతలు కూస్తున్నవారంతా ఎవరో చిల్లర వ్యక్తులు కాదు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నాయకులు. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారపార్టీ నాయకులు, పదేండ్లు మంత్రుల హోదాలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, కేంద్రమంత్రుల హోదాలో ఉండి అవాకులు, చెవాకులు పేలుతూ, మతం పేరుతో జనాన్ని ఎలా విడగొడదామా…అని స్కెచ్ వేసి, నోటికి పనిచేప్పే నాయకులు. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాకపోతే…ఇలాంటి వ్యక్తులు మనకు పాలకులుగా మారారని బాధపడాలో, కలికాలం అని సరిపెట్టుకోవాలో, మారతార్లే అని సర్దుకుపోవాలో అర్థంకాని పరిస్థితి. ఈ కూతలు కూసే నేతలెవరకీ జనం ఏమనుకుంటారో అనే విజ్ఞత లేదు. వాడు తిట్టాడు కాబట్టి… నేనూ తిట్టా అని సమర్థించుకోవడమే ముఖ్యం. తమ వ్యాఖ్యల్ని ఇండ్లలో టీవీలు చూసే చిన్న పిల్లలు, సెల్‌ఫోన్లలో యూట్యూబ్ చూసే విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, యువతీ, యువకులు వింటారనీ, చూస్తారనే సోయి కూడా లేదు. ఈ నేతలు భావి తరాలకు ఏం నేర్పిస్తున్నారు? రాజకీయ మంటే ఇలానే మాట్లాడాలి అని శిక్షణ ఇస్తున్నారా? ఇప్పటికే రాజకీయ నాయకుల నోటికి భయపడి, వాళ్ళ భాష విని జుగుప్స కలుగుతుంది. నాయకులు అనగానే తామేదో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవదూతలుగా భావించుకుంటూ, చుట్టూ బౌన్సర్లు, వెనుక ఓ 30 కార్లు ఉంటేనే జనం గుర్తిస్తారనే భ్రమలో ఈ పిచ్చి నేతలు ఉన్నట్టున్నారు. గతంలో మీడియా ఇంత విస్తరించి లేదు కాబట్టి, రాజకీయ నాయకులు ఎక్కడన్నా ‘అన్ పార్లమెంట్’ పదం వాడితే, స్వీయ నియంత్రణలో భాగంగా విలేకరులు ఆ మాటల్ని కట్ చేసి వార్తలు రాసేవాళ్లు. ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. సోషల్ మీడియా రాజ్యమే లుతుంది. లైవ్ టెలికాస్ట్‌లు వచ్చేశాయి. మనం ఏం మాట్లాడితే అవి అప్పటికప్పుడు జనంలోకి వెళ్లిపోతు న్నాయి. అలాంటప్పుడు పెద్ద హోదాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఎంత హుందాగా ఉండాలి. ఇవన్నీ సదరు నేతలకు తెలియనివేం కావు. ఎవరికి వాళ్ళు ‘మాకు తప్పట్లేదు’ అని సమర్థించు కుంటూ కొనసాగిస్తున్నారు. ‘యథారాజా..తథా ప్రజ’… రాజు ఎలా ఉంటే, ప్రజలు కూడా అలాగే ఉంటారని అర్థం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు దీనికి పూర్తి భిన్నం. రాజరికాలు లేకున్నా, పాలించే నేతల పిచ్చి చేష్టలు, వ్యాఖ్యల్ని ఓపిగ్గా భరిస్తున్నారు. ఆ మౌనాన్ని అంగీకారంగా భావించి, బూర్జువా పార్టీల నేతలు బండ బూతులు, రౌడీల తరహా వార్నింగ్‌లు ఇస్తూ జనం చెవుల్లోంచి రక్తం కారిస్తున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే! సమస్యల నుంచి ప్రజల్ని పక్కతోవ పట్టించాలంటే అధికారంలో ఉన్నోళ్లో, ప్రతిపక్షంలో ఉన్నోళ్లో ఏదో ఒక కొంటెకూత కూసి, దాన్నే అజెండాగా మార్చి… ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని జనం గమనించట్లేదనుకుంటే పొరపాటు. మీ భాష వినలేక ఛస్తున్నాం…కాస్త మనుషుల భాషలో మాట్లాడండి…ప్లీజ్!!
కమ్యూనిస్టుల్ని చూసి నేర్చుకోండి
ఈ దేశంలో కమ్యూనిస్టులు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. వారూ అధికార పార్టీలపై రాజకీయ విమర్శలు చేస్తారు. అవెప్పుడూ శృతి మించవు. వాడే భాషలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హూందాగా వ్యవహరిస్తారు. సమస్యలపై ప్రజల్ని చైతన్యం చేసేందుకు పాలకుల విధానాలను విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తారే తప్ప, చౌకబారు వ్యాఖ్యలు, విశృంఖలత్వంతో కూడిన వ్యక్తిగత విమర్శ, భాష కనిపించవు. కనీసం వాళ్లను చూసైనా బూర్జువా పార్టీల నేతలు బుద్ధి తెచ్చుకుంటే మంచిది.
ఇదేం భాష..వినలేక చస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES