– సుడాన్‌లో 46మంది దుర్మరణం
కైరో : సుడాన్‌లోని వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం కూలిపోయి 46 మంది మరణించారని ప్రాంతీయ ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. సుడాన్‌కు చెందిన మిలటరీ విమానం ఖార్టూమ్ శివార్లలో నివాస ప్రాంతాల్లో కూలిపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుందని ఆ వర్గాలు చెప్పాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు కలిగిన రెడ్ సీ సిటీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానంలో ఉన్నత స్థాయి సైనికాధికారులు వున్నారని స్థానిక మీడియా వార్తలు తెలుపుతున్నాయి. అయితే ఆ వార్తలను మిలటరీ ధ్రువీకరించనూ లేదు, ఖండించనూ లేదు. మొత్తంగా 46మంది మరణించగా, 10మంది గాయపడ్డారని ఖార్టూమ్ రీజనల్ ప్రభుత్వ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా వున్నారని, అందరికీ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని సైనిక వర్గాలు తెలిపాయి. పెద్ద శబ్దం వినిపించిందని, ఆ వెంటనే నల్లని దట్టమైన పొగ కమ్ముకుపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అనేక ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ కారణంగా ఆ ప్రాంతమంతా విద్యుత్ తీగలు తెగి అంథకారం అలుముకుంది.