గోడమీది పిల్లి!

 Neti Vyasam అది పిల్లుల సమావేశం. ‘పెద్ద సంఖ్యలో పిల్లులన్నీ హాజరయ్యాయి. చాలా కాలం తర్వాత సమావేశం జరుపుతున్నందున, ఎజెండా కూడా ముందుగానే విడుదల చేసినందువల్ల హాజరు బాగా పెరిగింది. ఈ సమావేశానికి గండుపిల్లి అధ్యక్షత వహిస్తున్నది. సమావేశాన్ని ప్రారంభించటానికి సూచనగా గండుపిల్లి గొంతు సవరించుకున్నది. అంతా సద్దుమణిగింది.
‘మిత్రులారా! ఈనాటి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ మీటింగుకు ఎలాంటి ఎలుక మాంసం, పాలు గాని ఇవ్వబడవని ముందుగానే ప్రకటించాము. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ అభినందనలు. ఇక ఈనాటి ఎజెండా మీ అందరికీ తెలుసు. ”గోడ మీది పిల్లి” అనే సామెతను మార్చి ”గోడమీది పొలిటీషియన్‌”అని మార్చాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. దీనిపై చర్చ ప్రారంభి స్తున్నాను. ఒక్కొక్కరూ మాట్లాడాలి! మన చర్చలు ఆ చట్టసభలలో రాజకీయ నాయకుల చర్చల్లా ఉండరాదని సూచిస్తున్నాను అంటూ ముగించింది గండుపిల్లి.
అధ్యక్షా! ఈ తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నాను. ఎందుకంటే చాలా కాలంగా మన జాతి వారంతా గోడ మీద నిలబడటం, అటూ ఇటూ చూసి, తమ నచ్చిన దిక్కు దూకటం మానివేశారు. సరిగ్గా చెప్పాలంటే ఈ తరం పిల్ల కూనలకు గోడ దూకటం అంటే ఏమిటో అర్ధం కావటం లేదు. అలాంటపుడు ఈ సామెత ఎందుకు అని ప్రశ్నిస్తున్నాను. తక్షణమే ఈ సామెతను మార్చాల్సిన అవసరం ఆ ఉందని డిమాండు చేస్తున్నాను. మన ముందు తరాల వారు ఈ నిందను మోసింది చాలు! అంది తెల్లపిల్లి.
అధ్యక్షా! ఈ తీర్మానం 100 శాతం అవసరం! అధ్యక్షా మనం గోడలు దూకటం మాని చాలా కాలమైంది! అందువల్ల గోడ దూకే అలవాటు కూడా తప్పిపోయింది. ఆ మధ్య నేను అత్యవసర పని మీద గోడ దూకాలని ప్రయత్నించి, కాలు విరగొట్టుకున్నాను. కాని ఈ మధ్య గోడలు దూకుతున్న రాజకీయ నాయకులకు ఒక్కరికి కూడా కాళ్లు విరగటం లేదు! కానీసం చిన్న గాయం కూడా కావటం లేదు! అంటే గోడ దూకే విద్యలో రాజకీయ నాయకులు ఆరితేరిపోయారు!’ అందువల్ల ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను!అన్నది నల్లపిల్లి.
అధ్యక్షా, మన ముందు తరాల వారు అనవసరంగా గోడలు దూకలేదు! ఆకలి తీర్చుకోవటానికి, శత్రువుల బారి నుండి తప్పించుకోవాలనే గోడలు దూకారు. అంతేకాని అవకాశవాదంతో ఏనాడూ వ్యవహరించలేదు! కాని ఈ రాజకీయ నాయకులు మాత్రం పక్కా అవకాశవాదులు. అందుకే ఎటు పడితే అటు దూకుతున్నారు. పదవుల కోసం అటూ ఇటూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఏ పక్క ప్రయోజనం ఉంటే అటు దూకుకున్నారు. అందువల్ల ఈ తీర్మానం ఎంతో న్యాయబద్ధమైనది. దీనికి నా పూర్తి మద్దతు. తెలుపుతున్నాను అన్నది! ఓ నడి వయస్సు పిల్లి.
అధ్యక్షా! గోడ మీది పొలిటిషియన్‌ అన్న వాక్యమే ఎంతో వినసొంపుగా, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది! ఇంతవరకు మాట్లాడిన మిత్రులు చెప్పినట్లు మనవారు గోడ దూకటానికి గల కారణాలు న్యాయమైనవి. మన మను గడకు ఎంతో అవసరమైనది కూడా. కాని ఈ రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం గోడ మీద నిలబడు తున్నారు. టిక్కెట్లు ఇస్తామంటే ఇటు దూకుతున్నారు. లేదంటే అటు దూకుతున్నారు. ఇట్లా దూకే వారిని గోడ మీద పిల్లులు అంటూ టీవీలలో మనజాతిని అవమానిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తీర్మానాన్ని నేను బలపర్చుతున్నాను అన్నది ఓ మచ్చల పిల్లి.
అధ్యక్షా! ఈ రాజకీయనాయకులు పార్టీలు మార్చే వేగం మామూలుగా లేదు! నేను ఒక ఇంట్లో కాలనీలోని ఇంట్లో పిల్లలను కన్నాను! అన్ని ఇండ్లు ఒకేలా ఉండటంతో, ఆ ఇంటి మీద ఉన్న గులాబీ జెండాను గుర్తుగా పెట్టుకుని, పని మీద బయటకెళ్ళి వచ్చి గులాబీ జెండా ఉన్న ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ నా పిల్లలు లేరు. కంగారు పడి వెతుకుతుంటే, పక్క ఇంట్లో నుండి నా కూనల అరుపులు గుర్తుపట్టి అటు వెళ్ళి పక్క ఇంట్లోకి ఎందుకొచ్చారు! అప్పుడే కాళ్లు వచ్చాయా అని కూనల మీద కేకలేశాను. అమ్మ నీవు బయటికెళ్ళినప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. పావు గంటలోనే ఇంటి ఓనరు గులాబీ జెండా తీసేసి, కాంగ్రెస్‌ జెండా పెట్టుకున్నారు. పక్క ఇంటి ఓనరు కూడా రాజకీయ నాయకుడే కదా! ఆయనేమో కాంగ్రెస్‌ జెండా తీసేసి గులాబీ జెండా పెట్టుకున్నాడు.
అందుకే నీవు పొరపడ్డావు. అన్నాయి నా కూనలు! ఇలా నిమిషాల వ్యవధిలోనే పార్టీలు మార్చటం, గోడలు దూకటం రాజకీయ నాయకులకే సాధ్యం! అందుకే తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నాను అన్నది తల్లిపిల్లి.
అధ్యక్షా! రాజకీయ నాయకులే కాదు! రాజకీయ పార్టీలు కూడా గోడలు దూకటాన్ని ప్రోత్సహిస్తున్నాయి! అభ్యర్థులను ప్రకటించకుండా, ఎదుటి ఎదుటి పార్టీ గోడల మీద ఎవరు కూర్చున్నారో చూసి, వారిని ఇటువైపు దూకమంటూ ప్రోత్సహిస్తు న్నాయి. నోటికొచ్చినట్లు తిట్టినవాడు గోడ దూకగానే మర్యాదస్తుడై పోతున్నాడు. టిక్కట్టు కొట్టేస్తు న్నాడు. విలువల్లేని రాజకీయాలు నడుపు తున్న నాయకులను గోడమీద పిల్లులు అది పిలవటం మన జాతికి అవమానం! అందు వల్ల ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను!’ అన్నది ఆవేశంగా మరో యువపిల్లి.
అధ్యక్షా,రాజకీయ పార్టీలు ఏ ఏవో పథకాలు ప్రకటించి. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఊదర గొడుతారు. మరోపక్క గోడ దూకి వచ్చే నాయకుల కోసం ఎదురు చూస్తారు. విధానాలు కంటే నాయకులే గెలిపిస్తారని నమ్ముతున్నారన్న మాట. అంటే గెలుపుకోసం, విధానాలు పక్కన పెడుతున్నార న్నమాట! ఇలా నైతిక విలువలు లేని రాజకీయ నాయకుల వల్ల మన జాతికి చెడ్డపేరు వస్తున్నది. అందుకే ఈ తీర్మానాన్ని మనమంతా ఆమోదించాలి. అన్నది. ఓ పెద్ద వయస్సు పిల్లి.
”ఈ మనుషులంతా ఇంతే ! మనం గోడమీద నిలబడి అటూ, ఇటూ చూసి గోడ దూకగానే, వారింట్లో దొంగతనం చేయడానికి వచ్చామని ఊహించుకుని, కొట్టడానికి కట్టె తీసుకుని వస్తారు! కాని అటూ ఇటూ చూసి, తమ స్వార్థం కోసం గోడలు దూకే రాజకీయ నాయకులను మాత్రం ఓట్లేసి గెలిపిస్తారు! ఇదెక్కడి న్యాయం? ఒక నియోజక వర్గంలోని ఇద్దరు నాయకులు, ఆయన పార్టీలోకి ఈయన! ఈయన పార్టీలోకి ఆయనా మారి పోటీ చేస్తున్నారు! మరో నాయకుడు ఆరు సార్లు పార్టీల గోడలు దూకి రికార్డు సృష్టించాడు.
నిన్న ఎదుటి పార్టీలోని నాయకుడు ఈ రోజు గోడ దూకి ఇవతలి పార్టీలోకి రాగానే, ఇవతలి లీడర్లు అవతలికి దూకుతున్నారు! ఈ రాజకీయ నాయకుల స్వార్థానికి, అవకాశవాదానికి అంతులేదు. నీతి నియమాలు లేవు. నైతిక విలువలు లేవు. తామున్న పార్టీ పట్ల, ప్రజల పట్ల విశ్వాసం, విధేయత గాని లేవు. ప్రజల కోసం, నియోజక వర్గ అభివృద్ధి కోసం పార్టీ గోడ దూకానని నిస్సిగ్గుగా చెప్పుకునే ఈ రాజకీయ నాయకులతో పిల్లులకు పోలికే లేదు. మనకు ఒక్కసారి పాలుపోసిన యజమాని పట్ల విశ్వాసంగా ఉంటూ ఎంతో సేవచేస్తాము! అందువల్ల ”గోడమీద పిల్లి” అనే వాక్యాన్ని మార్చి ”గోడ మీద పొలిటిషియన్‌” అనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ప్రకటిస్తున్నాను. అని గండుపిల్లి అనగానే పిల్లులన్నీ బల్లలు చరిచాయి.
– ఉషాకిరణ్‌ 

Spread the love