ఉషా ఓరాన్... జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలోని ఖఖ్‌పర్తా గ్రామానికి చెందిన సాధారణ గృహిణి. తన కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో మాట్లాడే ధైర్యంగానీ, ఆత్మవిశ్వాసంగానీ లేని ఓ మహిళ. అలాంటి ఆమె ఇప్పుడు వంట కోసం క్లీనర్ ఇంధనాలను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తుంది. మహిళలు ఆర్ధికంగా బలపడేందుకు కూడా ఇది సహాయం చేస్తుందని చెబుతుంది. ఫలితంగా కట్టెలపొయ్యికి బదులు వంట సిలిండర్ ఉపయోగించవచ్చని అంటుంది. క్లీన్ కిచెన్ చాంపియన్‌గా నిలిచింది. ఓ గృహిణిగా ఉన్న ఆమె నాయకురాలి స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకుందాం…
సాంప్రదాయ బయోమాస్ పొయ్యిలు మహిళల ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలుసు. అందుకే జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలోని ఖఖ్‌పర్తా గ్రామానికి చెందిన ఉషా ఒరాన్ శుభ్రమైన వంట పొయ్యిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ‘కొంత మేర చదువుకున్నప్పటికీ నా జీవితం నా ఇంటి నాలుగు గోడలకే పరిమితమైంది. చాలా కాలం నా ముగ్గురు కొడుకుల సంరక్షణ, ఇంటి పనులతోనే నా రోజులు గడిపాను. డిసెంబర్ 2021లో నేను జార్ఖండ్‌లోని స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ అనే ఓ ఎన్‌జీఓ నిర్వహించిన వాతావరణ మార్పుపై ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. అదే నా జీవితాన్ని మార్చేసింది.
సిలెండర్ కొనే శక్తి లేక
మొదటి సారి ఒక వేదిక నుండి నా ఆలోచనలను పంచుకునే అవకాశం నాకు లభించింది. అందరి ముందు మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే నా కుటుంబంతో కాకుండా ఇతరులతో మాట్లాడే విశ్వాసం నాకు అప్పటి వరకు లేదు. చాలా మంది స్త్రీల వలె గ్రామంలో నేను కూడా వంట చేయడానికి చుల్హా (ఇటుక పొయ్యి) ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఈ చుల్హా చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఎల్‌పీజీ సిలిండర్ కొనాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఈ చుల్హా వాడడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ కార్యక్రమంలో నేను తెలుసుకున్నాను. ఈ సమస్య ముఖ్యమైనదని నేను గ్రహించాను. అందువల్ల జిల్లాలో గృహాల మధ్య ఇంధన వినియోగాన్ని, మహిళలు స్వచ్ఛమైన ఇంధనాలకు ఎందుకు మారడం లేదో అర్థం చేసుకోవడానికి నేను ఒక సర్వేలో పాల్గొన్నాను.
శుభ్రమైన వంట కోసం
నేను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ద్వారా నిధులు సమకూర్చుకుని అసర్, హోప్ ద్వారా అమలు చేయబడిన క్లీనర్ ఎయిర్ బెటర్ హెల్త్ ప్రాజెక్ట్‌లో ‘పర్దానా’ (ఓరాన్ భాషలో ‘ముందుకు వెళ్లడం’ అని అర్థం) దీదీగా పని చేయడం ప్రారంభిం చాను. మహిళలతో మాట్లాడినప్పుడు వారు ఎల్‌పీజీ సిలిండర్ కొనే ఆర్ధిక స్థోమత లేకనే చుల్హాను ఉపయోగి స్తున్నారని నాకు అర్థమైంది. అదే మహిళలు ఎక్కువ సంపాదించ గలిగితే, వారు శుభ్రమైన వంటకు ప్రాధాన్యం ఇవ్వడానికి వారి కుటుంబ సభ్యులను ఒప్పించగలరని వారికి అర్థమయ్యేలా చెప్పాను.
అందరూ మారిపోతున్నారు
జూన్ 2022లో పందుల పెంపకం ప్రారంభిం చడానికి ఇద్దరు మహిళలకు రుణం పొందేందుకు సహాయం చేశాను. వారు రెండు పందిపిల్లలను కొను గోలు చేశారు. స్థానికంగా లభించే మట్టి వంటి పదార్థా లను ఉపయోగించి షెల్టర్‌ను నిర్మించారు. పందుల పెంపకం ద్వారా వచ్చిన సంపాదనతో వారు ఎల్‌పీజీ సిలిండర్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు వంట చేయడం కోసం బయోమాస్ చుల్హా నుండి అందరూ మారిపోతు న్నారు. ప్రస్తుతం నేను రాంపూర్, తిగ్రా, బాఘా, భట్‌ఖిజ్రీ అనే నాలుగు పంచాయితీలను కవర్ చేస్తున్నాను.
కొత్త జీవనోపాధి ద్వారా
నాలుగు గ్రామాల్లో 28 స్వయం సహాయక బృందాలు, 374 మంది మహిళలు ఉన్నారు. నేను వారి జీవనోపాధిని, శుభ్రమైన వంటను ట్రాక్ చేయడానికి, మహిళలతో క్రమం తప్పకుండా సన్నిహితంగా ఉంటాను. నేను నా చుల్హాను ఉపయోగించడం మానేశాను. పూర్తిగా ఎల్‌పీజీకి మారాను. నాలాగే నెమ్మదిగా చాలా మంది మహిళలు మారడం ఇప్పుడు చూస్తున్నా. కొత్త జీవనో పాధి ద్వారా వచ్చే ఆదాయానికి వారు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రతి మహిళ కూడా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలదని, ఆర్థికంగా కూడా స్వాతంత్య్రం పొందగలదని నేను ఆశిస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించింది.
అవగాహన సెషన్‌లు
ప్రతి రోజూ చుల్హా పొగను పీల్చే నాలాంటి వందలాది మంది మహిళల జీవితాన్ని సులభతరం చేయడమే నా లక్ష్యం. సాధారణ సాధనాలను ఉపయోగించి నా సమాజంలోని మహిళలకు అవగాహన సెషన్‌లను నిర్వహించడం ప్రారంభించాను. సంఘంలో చురుగ్గా ఉండటం తోనే నేను అధ్యక్షు రాలిని అయ్యాను. జెఎస్‌ఎల్‌పీఎస్ పరిధిలోని క్లస్టర్‌ల ద్వారా జీవనోపాధి ఎంపికలను చర్చించడానికి సమావే శాలను నిర్వహించాను. వివిధ జీవనోపాధి పథకాలు, ప్రభుత్వ సామాజిక భద్రతా ప్రయోజనాలతో మహిళలను అనుసంధానం చేయడం ప్రారంభించాను. పశుపోషణ వంటి చిన్న వ్యాపారాలను స్థాపించడంలో వారికి సహాయపడ్డాను.