సమాజంలో మహిళ ఇష్టానికి గౌరవం లేదు. తనకు నచ్చని పని చెయ్యను అంటే తప్పు. నచ్చింది చేస్తానంటే ఒప్పుకోరు.
అదే పెండ్లయిన మహిళ అయితే మనసు చంపుకొని భర్త చెప్పినట్లు వినాల్సిందే. వినకపోతే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో కదా!
ఇక ఒంటరి మహిళైతే సమాజం చేయూత నివ్వకపోగా సూటి పోటి మాటలతో వేధిస్తుంది. అలాంటి కథే సుజాతది.
సుజాతకు 17 ఏండ్లు ఉన్నపుడు పెండ్లి జరిగింది. అప్పుడు భర్తకు 20 ఏండ్లు. ఆ ఇంట్లో మొత్తం ఎనిమిది మంది ఉంటారు. అందరికీ పెండిండ్లు జరిగాయి. ఎవరి సంసారాలు వారివి. సుజాతకు 20 ఏండ్లు వచ్చేసరికి ఒక పాప, ఇద్దరు బాబులు పుట్టారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కొంత కాలానికి అనుకోకుండా తోటికోడలు చనిపోయింది. అసలు సమస్య అప్పుడు మొదలైంది.
భార్య పోయిన దగ్గర నుండి మరిది సుజాతను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఆ విషయం భర్తకు చెప్పినా లాభం లేదు. ”మేమందరం కలిసి హాయిగా ఉంటున్నాం. ఈ చిన్న విషయానికే నువ్వెందుకింత ఫీలవుతున్నావు. వేరెవరితోనో సంబంధం పెట్టుకోవడానికి బాధపడాలి. సొంత మరిదితో పెట్టుకుంటే తప్పేం లేదు. నేనే ఒప్పుకుంటుంటే ఇక నీకెందుకు బాధ” అనేవాడు.
ఇక తన సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. దాంతో భర్త సుజాతపై తప్పుగా ప్రచారం మొదలు పెట్టాడు. ఎవరితోనే సంబంధం పెట్టుకుని పిల్లలను తీసుకొని వచ్చేసిందని సుజాత ఇంట్లో చెప్పాడు. దాంతో ఎంత చెప్పిన వినకుండా తల్లిదండ్రులు ఆమెను తిరిగి భర్త దగ్గరికి పంపించారు. అప్పటి నుండి ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు ఆమెను వేధించే వారు. తమకు అడ్డు చెబితే తన కూతురికి కూడా ఇదే గతి పడుతుందని బెదిరించేవారు.
కూతుర్ని ఎలాగైన అక్కడి నుండి పంపించేయాలని నిర్ణయించుకుంది. వెంటనే గురుకుల హాస్టల్లో చేర్పించింది. ఇద్దరు కొడుకుల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. అయినా కష్టాలు తప్పలేదు. ఏ ఆధారం లేక మూడు రోజులు రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయింది. పిల్లల్ని పెంచే స్థోమత తన దగ్గర లేదని భర్త వచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి వాళ్ళను తీసుకుపోయాడు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటే పిల్లల్ని నీతో ఉంచుకోవచ్చు అన్నారు. దాంతో ఇక తనకు ఈ ప్రపంచంలో ఎవరూలేరనే భావన వచ్చింది. ఒంటరి తనంతో విలవిలలాడింది.
సుజాత కోసం ఎవరూ రాలేదు. శరీరం కూడా సహకరించడం లేదు. తినడానికి తిండిలేదు. పక్కన కొంతమంది కూలి పనులకు వెళుతుంటే వాళ్ళతో కలిసి తనూ వెళ్ళింది. వాళ్ళు తెచ్చుకున్న భోజనం లోనే సుజాతకు కూడా కొద్దిగ పెట్టారు. పని దొరికిందిగానీ ఉండటానికి ఇల్లు లేదు. రోడ్డుపైన, స్టేషన్‌లో కొన్ని రోజులు గడిపింది. తర్వాత తను పని చేసే చోట ఏజెంట్ ఓ రూం కిరాయికి తీసుకొని అందులో పెట్టాడు. ఓనర్ అడిగితే నా భార్య అని చెప్పాడు. అ విషయం సుజాతకు ముందు తెలియదు.
తెలిసిన తర్వాత అతన్ని అడిగితే ‘అవును, చెప్పాను. ఒంటరి మహిళకు ఎవ్వరూ రూం ఇవ్వరు. అందుకే చెప్పాను’ అన్నాడు. ఇక తను ఏమీ మాట్లాడ లేకపోయింది. పని దొరకడంతో పిల్లల్ని తెచ్చుకుం దామనుకుంది. కానీ పిల్లలు ఆమెతో రావడానికి ఇష్టపడలేదు. ‘మీ అమ్మ ఎవరితోనే సంబంధం పెట్టు కొని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని’ నేర్చించాడు. భర్త సుజాతకు విడాకులు ఇచ్చేశాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది.
ఇప్పటికి సుజాత హైదరాబాద్ వచ్చి 15 ఏండ్లు అవుతుంది. తన బతుకు తాను బతుకుతున్నా చుట్టుపక్కల వారు సూటి పోటి మాటలు అనేవారు. కూలి దగ్గర ఏజెంట్ ‘నాకు భార్యా, పిల్లలు ఎవరూ లేరు. నాతో ఉంటే బాగా చూసుకుంటా’ అన్నాడు. తన గత జీవితం మొత్తం తెలిసిన వ్యక్తి కాబట్టి అతనితో ఉండేం దుకు అంగీకరించింది. ‘ఇక నుంచి నువ్వూ, నేను భార్యభర్తలా్లగ కలిసి ఉండాలి’ అని వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
సుజాతతో పాటు అతను 15 రోజులు కలిసి ఉన్నాడు. తర్వాత తన తల్లిదండ్రులను కలిసి వస్తానని వెళ్ళే వాడు. వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే ఆమెతో ఉండేవాడు. తాను సంపాదించుకున్న డబ్బుతో సుజాత నగలు చేయించుకుంది. చిట్టీలు వేసి వేరే ఊరిలో కొంత స్థలం కూడా కొనుక్కుంది. అయితే ఆ ఏజెంట్‌కు పెండ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారని సుజాతకు తెలిసింది. ఇదే విషయం అతన్ని అడిగితే ‘నిజం చెప్తే నువ్వు నాతో ఉండవు కదా, అందుకే అబద్ధం చెప్పా’ అన్నాడు.
‘నాకు నువ్వూ కావాలి, నా భార్యా కావాలి. ఇద్దరిలో నేను ఎవరినీ వదులుకోలేను’ అన్నాడు. కొన్ని రోజులు సుజాత జీవితం అలా గడిచిపోయింది. వీరిద్దరి సంబంధం గురించి భార్యకు తెలిసింది. ఆమె సుజాతకు ఫోన్ చేసి బాగా తిట్టేది. ఇదంతా సుజాతకు ఇబ్బందిగా ఉండేది. ఆమె తిట్టడం కరక్టే అనిపించింది. ఇక తను అతనితో ఉండ కూడదని నిర్ణయించుకుంది. ఇదే విషయం అతనికి చెప్పింది. కానీ అతను మాత్రం ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ బాధపడేవాడు.
అప్పుడప్పుడు వస్తూపోత్తు ఉండేవాడు. సుజాత కూడా అడ్డు చెప్పలేకపోయింది. అలా ఏడాది గడిచిపోయింది. ‘ఊరిలో పొలం ఇబ్బందుల్లో ఉంది. నాకు డబ్బులు కావాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అంటూ సుజాత దగ్గర బాధపడ్డాడు. సుజాత తన నగలు తీసి ఇచ్చింది. తన చిట్టీ డబ్బులు సుమారు మూడు లక్షల వరకు అతనే తీసుకుని వెళ్ళిపోయాడు. సుజాత ఉంటున్న ఇంటి కిరాయి కూడా ఆరు నెలల నుండి కట్టలేదు. అలా అతను వెళ్ళి దాదాపు ఎనిమిది నెలలు అయినా రాలేదు. ఫోన్ కూడా లేదు. వేరే ఫోన్‌తో చేస్తే తీశాడు.
‘ఏం జరిగింది. నా దగ్గరకు ఎందుకు రావడం లేదు’ అడిగింది. ‘ఇక నీకూ నాకూ ఎలాంటి సంబధం లేదు. నా భార్య రానివ్వడం లేదు’ అన్నాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
జరిగిందంతా చెప్పి ‘ఇప్పుడు నా జీవితం సర్వ నాశనం అయ్యింది’ అంటూ బాధపడింది. లీగల్‌సెల్ సభ్యులు అతన్ని పిలిచి మాట్లాడితే ‘ఆమె ఏమైనా నా భార్యనా. ఆమె బాధ్యత నాకు ఎందుకుంటుంది. అవసరమైనపుడు ఆమెకు అండగా ఉన్నాను. అయినా ఆమె నా ఒక్కడితోనే ఉందా? చాలా మందితో సంబం ధాలు ఉన్నాయి. అయినా నా భార్య ఇప్పుడు రానివ్వడం లేదు. మా పిల్లలు కూడా పెద్దయ్యారు. మా పాపకు పెండ్లి చేశాను. ఇప్పుడు నేను ఆమెతో సంబంధం పెట్టుకుంటే ఎలా, అందుకే నేను రావడం లేదు. ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాది’ అన్నాడు.
దాంతో సుజాత ‘నా వల్ల ఒకరి జీవితం నాశనం కావడం నాకూ ఇష్టం లేదు. కాకపోతే నా డబ్బు, నగలు ఇప్పించండి చాలు’ అంది. దానికి అతను ‘నేను ఇన్ని రోజులు చుశాను కదా, ఇప్పుడు నేను ఆ డబ్బులు నీకు ఎందుకివ్వాలి, ఇవ్వను’ అన్నాడు. దాంతో లీగల్ సెల్ సభ్యులు ‘నీ దగ్గర నుండి డబ్బు ఎలా తీసుకొవాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు.
దాంతో అతను ‘ఇప్పుడు నా దగ్గర లేవు, కొంచెం టైం కావాలి’ అన్నాడు. అతనికి రెండు వారాలు టైం ఇచ్చారు. ఇచ్చిన సమయంలో సుజాత డబ్బులు, నగలు తెచ్చి ఇచ్చాడు. ఇక ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు అనుకున్నారు. అతను వెళ్ళి పోయాడు. ‘ఇక ఎవరిని నమ్మాలి. ఈ వయసులో నన్ను ఎవరు చూస్తారు. ఈ డబ్బులు, నగలు తీసుకొని ఏదైన వృద్ధాశ్రమంలో చేరతాను’ అంటు సుజాత కూడా వెళ్ళిపోయింది.
– వరలక్ష్మి, 9948794051