Friday, June 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ కార్మికుల కోసం సమగ్రచట్టం చేయాలి

వ్యవసాయ కార్మికుల కోసం సమగ్రచట్టం చేయాలి

- Advertisement -

అసంఘటితరంగ కార్మికుల కోసం నిరంతర పోరాటాలు
రాష్ట్ర మహాసభలో ఉద్యమ కార్యాచరణ : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు
20 నుంచి మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర మహాసభ ప్రారంభం

నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
వ్యవసాయ కార్మికుల కోసం సమగ్రచట్టం చేసే వరకు ఉద్యమాలు చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు అన్నారు. అసంఘటితరంగ కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈనెల 20 నుంచి జరగనున్న సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1934లో వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన ఈ సంఘం నేటి వరకు నిరంతరం అనేక ఉద్యమాలు చేసిందని చెప్పారు. భూసంస్కరణలు, అటవీ హక్కుల చట్టం, సీలింగ్‌ యాక్ట్‌, ఉపాధి, అసైన్డ్‌ చట్టాలు వంటివి సాధించుకున్నామని తెలిపారు. సామ్రాజ్యవాద వికృత చేష్టలు, వ్యవసాయ ఒప్పందాల ఫలితంగా వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు. సాగును నమ్ముకున్న రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోలుకోలేని స్థితిలో రైతాంగం ఉందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి, వారి హక్కులను సాధించుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈనెల 20 నుంచి 22 వరకు మూడ్రోజుల పాటు జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతోపాటు కేంద్రం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మహాసభ వివరాలు
రాష్ట్ర మహాసభ మొదటి రోజు 12 గంటలకు ప్రదర్శన, 2 గంటలకు పట్టణంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ హాజరవుతారు. అదేవిధంగా.. మాజీ ఎంపి, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధక్షులు ఎ.విజయ రాఘవన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తదితరులు హాజరుకానున్నారు. రెండో రోజు ఉదయం 10 గంటలకు సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య ఆవిష్కరిస్తారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్‌ మధుసుదన్‌రెడ్డి స్వాగత ఉపన్యాసం, ప్రారంభ ఉపన్యాసం మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్‌ చేస్తారు. మూడోరోజు రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకుంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివరించారు. విలేకర్ల సమావేశం లో మహాసభ అహ్వాన సంఘం కోశాధికారి ఏ.రాములు, ఉపాధ్యక్షులు కిల్లె గోపాల్‌, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్‌ పద్మ, వ్యకాస జిల్లా కార్యదర్శి కడియాల మోహన్‌, జిల్లా ఉపాద్యక్షులు హన్మంతు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -