కోట్లు దోచిన దొంగలను పట్టించిన ఫ్రీ డ్రింక్‌

నవతెలంగాణ – ఉత్తరాఖండ్‌
సుమారు రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడిన వారు ఆ సొమ్మును దర్జాగా అనుభవించాలని అనుకుంటారు. విలాసవంతంగా డబ్బు ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లేకపోతే ఏ విదేశానికో చెక్కేస్తారు. కానీ దీనికి భిన్నంగా భారీ దోపిడీ చేసిన జంట కేవలం పది రూపాయల ఉచిత డ్రింక్‌ కోసం కక్కుర్తిపడి వచ్చి పోలీస్‌ ట్రాప్‌లో పడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. డాకూ హసీనాగా పేరుమోసిన మన్‌దీప్‌ కౌర్‌, ఆమె భర్తను రూ.8.49 కోట్ల భారీ దోపిడీ కేసులో పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వీరిని పట్టుకోవడానికి పోలీసులు పెద్ద స్కెచ్చే వేశారు. ఈనెల 10న లుధియానాలోని సీఎంఎస్‌ సెక్యూరిటీస్‌లో డాకూ హసీనా, మరికొందరు కలిసి 8.49 కోట్ల నగదును అపహరించారు. ఈ కేసులో నిందితులు దొరికినా, దోపిడీ ప్రధాన సూత్రధారులు హసీనా, ఆమె భర్త తప్పించుకుపోయారు. మన్‌దీప్‌ కౌర్‌, ఆమె భర్త జస్పిందర్‌ సింగ్‌లను ఎట్టకేలకు పోలీసులు ట్రాప్‌ చేసి ఉత్తరాఖండ్‌లోని హేమ్‌కుండ్‌లో పట్టుకున్నారు. వారి నుంచి 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ తర్వాత నేపాల్‌కు పారిపోదామనుకున్న ఈ దంపతులు ముందుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందినా, అంతమందిలో వారిని పట్టుకోవడమెలా అని ఆలోచించి భక్తులకు ఉచితంగా డ్రింక్‌ను పంపిణీ చేసే స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఉచిత డ్రింక్‌ను తాగడానికి వచ్చిన హసీనా దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేసి పంజాబ్‌కు తరలించారు.

Spread the love