ఆశాల సేవల్ని గుర్తించని సర్కార్‌

A government that does not recognize canteen services– 18 ఏండ్లుగా పారితోషికం తప్ప వేతనమివ్వని వైనం
– కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు
– రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనమివ్వాలని డిమాండ్‌
– అనేక రకాల వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లు
– హెల్త్‌ గ్లోబల్‌ లీడర్స్‌గా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు
– 13 రోజులుగా సమ్మె.. స్పందించని అధికారులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తృత పర్చాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదట్లో చేసిన పనిని బట్టి పారితోషికం ఇచ్చారు. రానురాను అనేక రకాల పనుల్ని చేయాల్సి రావడంతో ఆశాలు సైతం చేస్తూ వస్తున్నారు. 18 ఏండ్లుగా వైద్యారోగ్య శాఖలో ఎంతో కష్టపడి వైద్య సేవలందిస్తున్న ఆశాలకు కనీస వేతనం ఇవ్వడంలేదు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు చేశారు. చాలా మంది కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆశాలకు రావాల్సిన బిల్లుల్ని సైతం ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఫిక్స్‌డ్‌ వేతనంతో పాటు ఇతర సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించాలని ఆశాలు కోరుతున్నారు.
వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో జనాభాను బట్టి ఆశా వర్కర్లను నియమించారు. వారికి వైద్యారోగ్య శాఖ అనేక రకాలైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. వాటిల్లో శిక్షణ పొంది విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో గర్భిణులను గుర్తించడం, సాధారణ ప్రసవాలు జరిగేట్టు చూడటం ఆశాల పనిగా ఉండేది. కాన్పులను బట్టి పారితోషికం ఇచ్చేది. అంతేకాక, రోజువారి డ్యూటీకి సంబంధించిన రిజిస్టర్‌ మెయింటేన్‌ చేస్తూ సర్వీస్‌ చేస్తున్నారు. వీరందరి వివరాల్ని ఆన్‌లైన్‌ చేయబడ్డాయి.
జీతం లేదు.. పని భారమెక్కువ..
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నెలసరి జీతం ఇవ్వని ప్రభుత్వం వారితో అనేక పనులు చేయిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్‌, థైరాయిడ్‌, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్నారనేది సర్వే ద్వారా ఆశా వర్కర్లు గుర్తించారు. వారందరికీ నిరంతరం మందులు అందేలా చూడటంతో పాటు పల్స్‌ పోలియో, వాక్సినేషన్‌, కంటి వెలుగు, లెప్రసీ సర్వే, టీబీ పేషెంట్లకు మందులివ్వడం, కరోనా చికిత్స వంటి కార్యక్రమాల్లో ఆశాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, ఇతర ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అర్థరాత్రి అపరాత్రి అనే తేడాలేకుండా గర్భిణులను ప్రసూతి సేవల కోసం ఆస్పత్రులకు తీసుకెళ్తూ తల్లీబిడ్డా క్షేమంగా ఉండేలా చూడటంలో వారి పాత్ర కీలకం. కరోనా సమయంలో ఆశాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. కరోనా కిట్లు పంపిణీ చేశారు. కరోనా పరీక్షలు చేయించడం, పాజిటివ్‌ వచ్చిన వారికి క్వారంటైన్‌లో ఉంచి వారూ మందులు వాడేలా చూడటంలో సహాసోపేతమైన పాత్రనే పోషించారని ప్రభుత్వమే ప్రకటించింది.
కరోనా కాలంలో ఆశా వర్కర్లు అందించిన సేవల్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌ఓ) హెల్త్‌ గ్లోబల్‌ లీడర్స్‌ అని ఆశా వర్కర్లకు ఆవార్డు ప్రకటించింది. ఇంతటి కఠోరమైన సమయంలో కూడా సేవలందించిన ఆశా వర్కర్లకు ప్రభుత్వం నామమాత్రంగా రూ.9750 పారితోషికం మాత్రమే ఇస్తుంది.
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సబ్‌ సెంటర్లు, బస్తీ దావఖానాల్లో పనిచేస్తున్నారు. పని భారం పెరిగినా కష్టపడి పనిచేస్తున్నారు.
శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడంతో నిత్యం పెరుగుతున్న ధరల ప్రభావంతో ఆశా వర్కర్లకు కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెప్రసీ సర్వేలో పాల్గొంటున్న ఆశాలు శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. టీబీ పేషెంట్ల తెమడ, మూత్రం సేకరించే పనులు చేయించడంతో ఆశాలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా అనారోగ్యం పాలవుతున్నారు కూడా.
ప్రగతి భవన్‌ ముట్టడిస్తాం
న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగత్‌ భవన్‌ను ముట్టడిస్తాం. 13 రోజులుగా సమ్మె చేస్తున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కనీసం ఆశాల గురించి పట్టించుకోవడంలేదు. ఆరోగ్య తెలంగాణ కావాలని, అందుకు ఆశాలు కష్టపడి పనిచేస్తున్నారని చెప్పే మంత్రి.. మా న్యాయమైన సమస్యల్ని ఎందుకు పరిష్కరించడంలేదో చెప్పాలి. సమ్మె పట్ల నిర్లక్షంగా ఉంటే చలో హైదరాబాద్‌కు తరలి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం.
– వరలక్ష్మీ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు.
రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనమివ్వాలని.. 13 రోజులుగా సమ్మె
రోజుకు పది గంటలకు పైగా పనిచేయిస్తున్న తమకు ప్రభుత్వం నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ జీతం ఇవ్వాలని ఆశాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆశాలకు జాబ్‌ఛార్ట్‌ విడుదల చేయాలని, 2021 జులై నుంచి డిసెంబర్‌ వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు రూ. వెయ్యి రూపాయల్ని రాష్ట్రం చెల్లించలేదు. 16 నెలలకు సంబంధించిన బకాయి డబ్బులు విడుదల చేయలేదు. ప్రభుత్వమే 32 రకాల రిజిస్ట్రర్లను ప్రింట్‌ చేసి సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. ఐదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆశాలకు ప్రసూతి సెలవులు వర్తింపచేస్తూ సర్క్యూలర్‌ జారీ చేయాలని కోరుతున్నారు. ఇతర డిమాండ్లతో ఆశావర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 13 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె పోరాటాన్ని కొనసాగిస్తామని ఆశాలు హెచ్చరిస్తున్నారు.

Spread the love