రాకేష్ మాస్టర్ కుటంబ సభ్యుల గొప్ప నిర్ణయం..రాకేష్ మాస్టర్ కళ్లు దానం

నవతెలంగాణ-హైదరాబాద్ : రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్​లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన ఇక లేరనే వార్తను విని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ టైమ్​లో రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటో తెలిస్తే వారికి సెల్యూట్ చేయకుండా ఉండలేరు.  ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను సికింద్రాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు ట్రీట్​మెంట్ అందించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూనే రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. డయాబెటిక్ పేషెంట్ అయిన మాస్టర్​కు సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని, షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. టాలీవుడ్​లో దాదాపు 1,500 సినిమాలకు పనిచేశారు రాకేష్ మాస్టర్. ముక్కురాజు మాస్టర్ దగ్గర ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్​గా రాకేష్ మాస్టర్ పనిచేశారు. స్టార్ హీరోలు ప్రభాస్, వేణు, నటి ప్రత్యూష లాంటి వాళ్లు రాకేష్ మాస్టర్ దగ్గరే డ్యాన్స్​లో మెళకువలు నేర్చుకోవడం విశేషం. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్​లు కూడా ఆయన శిష్యులే కావడం గమనార్హం. ఇకపోతే, రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు తన అవయవాల్లో పనికొచ్చే వాటిని లేనివారికి దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ తెలిపాడు. డాక్టర్లను కలసి పోస్టుమార్టం చేసి.. బాడీ పార్ట్స్​ను తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని చెప్పామన్నాడు సాజిద్. బాడీ అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్పామని అతడు వెల్లడించాడు. ఇక, చూపులేని వారికి రాకేష్ మాస్టర్ కళ్లను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. తన అవయవాలను డొనేట్ చేయాలనుకున్న రాకేష్ మాస్టర్ గొప్ప మనసును, ఆర్గాన్ డొనేషన్​కు సమ్మతి తెలిపిన ఆయన ఫ్యామిలీ నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

Spread the love