నేను బాగానే ఉన్నా: కమెడియన్‌ సుధాకర్‌

నవతెలంగాన – హైదరాబాద్‌: తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై టాలీవుడ్‌ కమెడియన్‌ సుధాకర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తన గురించి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై సుధాకర్‌ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ ఆరోగ్యం బాలేదని.. ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రూమర్స్‌ కనిపించాయి. తాజాగా వీటిపై సుధాకర్‌ స్పందించారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని చెప్పిన ఆయన.. ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దని కోరారు. ‘‘నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని సుధాకర్‌ తెలిపారు. దీంతో ఇలాంటి తప్పు సమాచారం వైరల్‌ చేస్తున్న వారిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిపై ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయెద్దంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. భారతీరాజా తెరకెక్కించిన ఓ సినిమాతో సుధాకర్‌ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా అలరించారు. తనదైన శైలిలో డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. సహాయ నటుడిగా, విలన్‌గా… తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక సుధాకర్‌ ఆరోగ్యంపై గతంలోనూ ఇలాంటి రూమర్సే వచ్చాయి. అప్పుడూ కుటుంబసభ్యులు వాటిని ఖండించిన విషయం తెలిసిందే.

Spread the love