హృదయాల్ని తాకే అనుభూతుల సవ్వడి

అమ్మ ముచ్చట్లుఅమ్మ ముచ్చట్లు
పేజీలు : 108,
వెల : 100/-
రచన : ఆలూరి రాఘవ శర్మ,
ప్రతులకు : 9493226180
సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవ శర్మ గారు రాసిన ‘అమ్మ ముచ్చట్లు’ నిజానికి ఎందరో అమ్మల సజీవ జ్ఞాపకాల దొంతర్లు. అమ్మ అనగానే ఒక సెంటిమెంట్‌ అంటుకుంటుంది. అమ్మ గురించి ఎవరు రాసినా కమ్మదనమే తప్ప కంప్లైంట్లు ఏమీ ఉండవు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన గీతాంజలి ‘అసలు ఆత్మకథల్లో, లేదా అమ్మల జీవిత చరిత్రల్లో ఏముంటుంది? ఒట్టి వ్యక్తిగత జీవన పోరాటాలు మాత్రమే ఉంటాయా? అమ్మల చుట్టూనో, నాన్నల చుట్టూనో ఉన్న అప్పటి సమకాలీన సమాజం చరిత్రా, రాజకీయ ఆర్థిక విషయాలూ ఉంటాయి. తమ కథలో సమాంతరంగా సాగిపోయే సమాజ చలన సూత్రాలను చెప్పకనే చెబుతారు అమ్మలు. వీటితో పాటూ మారే సామాజిక చలన సూత్రాల ఉత్పత్తి సంబంధాల్లో, మరీ ముఖ్యంగా కుటుంబ జీవితాలలోని స్త్రీల జీవితాల్లో మౌలిక మార్పులు ఆయా కాలాల్లో ఎలా ఉన్నాయో తెలుపుతా’యంటారు. ఇంతకుమించి ఈ పుస్తక తాత్వికతను ఇంత గొప్పగా వేరెవరూ చెప్పి ఉండకపోవచ్చు.
ఇంటింటా ఉండే ప్రతి అమ్మకీ ఒక అంతులేని కథ ఉంటుంది. ఆనంద విషాదాలు పడుగు పేకల్లా అల్లుకుపోయిన అనంతమైన జీవితం ఉంటుంది. సమాజంతో పాటూ సమాంతరంగా నడుస్తూ, నడిపిస్తూ కుటుంబ శ్రేయస్సే సర్వస్వంగా పాటుబడే అమ్మకు కూడా సమాజమే దర్పణం. సమాజం శాసించిన, జన్మత: వచ్చిన, మతం నూరిపోసిన, కులం విధించిన కట్టుబాట్లు యధాతధంగా పాటించకుండా అవి అసందర్బంగా, మూర్ఖంగా, ఇతరులకు అవమానకరంగా ఉండే వాటి పట్ల చైతన్యంతో వ్యవహరించటమూ, తన కుటుంబానికి అటువంటి వాటిని అధిగమించడం నేర్పే, ప్రశ్నించే తత్వాన్ని అలవరిచే అమ్మలు నిజానికి ఈ సమాజపు రుజుపథికులు. మార్పు సమాజపు మౌలిక సూత్రం. మార్పుల వైపు మనుషుల్ని తోడుకొని వెళ్లడం అమ్మే చేస్తే దానికి తిరుగుండదు. సరిగ్గా అటువంటి అమ్మనే ఈ పుస్తకంలో చూస్తాం. ఒక చైతన్యవంతపుటమ్మ యావత్‌ కుటుంబాన్నీ ఎలా చైతన్యపు బాటలో నడిపించగలదో ఈ పుస్తకం చెబుతుంది.
పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారొకసారి విద్వాన్‌ విశ్వం గురించి రాస్తూ ”మనం కులాల పేర్ల పడవలెక్కి, యిళ్ళ పేర్ల పడవలెక్కి ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డాం. ఆ అవసరం విశ్వం గారికి లేదు” అన్నారట! అదే సందర్భంలో బాపూజీ గారు ”నేను నా కులం పేరును సూచించే సర్టిఫికెట్లలోనూ, ఇతర డాక్యుమెంట్లలోనూ తీసేసాను, మీరు కూడా తీసేయొచ్చు” అన్నారట రాఘవ శర్మ గారితో! రాఘవ శర్మ గారు తన పేరు వెనక వున్న ఈ ‘శర్మ’ అనే కులాన్ని సూచించే ఈ ప్రత్యేక శబ్దం ఎందుకమ్మా పెట్టావని చిరాకు పడుతూ అడిగినప్పుడు ఆ అమ్మ ఇచ్చిన సమాధానం, ”నిన్ను కన్నాను కానీ, నీ ఆలోచనలని కనలేదు కదా” అని!
అంత చైతన్యవంతంగా తీర్చిదిద్దిన ఈ అమ్మ ఎంత ప్రజాస్వామిక వాదో ఇలాంటి అనేక ఉదాహరణలు చూపిస్తారు. రాఘవ శర్మ గారు తోటలో చీపురుతో ఊడుస్తున్నప్పుడు ఆ దారెంట వెళ్లే వాళ్ళు ”ఏమి సామీ నువ్వు ఊడుస్తుండావు” అనే వాళ్లతో, అక్కడే ఉన్న అమ్మ, ”మగాడైనంత మాత్రాన చీపురు పట్టుకుంటే వాడి మగతనానికేమీ భంగం కాదులే” అనగలిగిన చైతన్య శీలి. ఏ శ్రమలు ఎవరెవరు చేయాలో ఆడ పనులూ, మగ పనులూ అంటూ యుగాలుగా ఉన్న సాంప్రదాయపు స్పృహను తేలిగ్గా తీసేయడం ఎంత అభివృద్ధికర ఆలోచనో అర్థం చేసుకోవచ్చు. శ్రమల పట్ల ఒక సాంప్రదాయపు వాతావరణంలో పెరిగిన అమ్మకు ఇటువంటి ఆలోచన ఉండటం చాలా గొప్ప విషయం. ఇవే కాదు ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ”పనిచేయని కాడికి చేతులెందుకని?” అడిగిన అమ్మ చైతన్యాన్ని అర్థం చేసుకోగలం.
80 ఏళ్ల సుదీర్ఘ జీవిత జ్ఞాపకాల్లో ఆమె పెంపకంలో పెరిగిన రాఘవ శర్మ గారిలో కూడా అనేక మానవీయ కోణాలు ఈ ముచ్చట్లలో దొర్లుతాయి. ఇంట్లో దొంగలు పడి ఇంటిని మరుగు దొడ్డిగా వాడిన వాళ్ల మీద జుగుప్సకు బదులు ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన రాఘవ శర్మ గారి మాటలు విన్నాక అదెంత గొప్ప విషయమో అర్ధం అవుతుంది. ”దొంగతనానికి వచ్చిన వీరు నగలూ డబ్బూ దోచుకోకుండా కేవలం ఆవకాయ వేసుకుని అన్నం తినేసి ఎందుకు వెళ్లిపోయారు? కేవలం తిండి కోసం దొంగతనానికి వచ్చారంటే తిండికి వారెంత మొహం వాచారో? కాస్తో కూస్తో భూములు ఉన్న కుటుంబాలు తింటున్న ఆవకాయ అన్నానికి కూడా ఆశపడ్డారంటే వారి దీనస్థితి ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. కరువు కాటకాలు సంభవించినప్పుడు, విపరీతమైన ఆర్థిక అసమానతలు ఏర్పడినప్పుడు తిండి కోసం దొంగతనాలు జరుగుతాయి” అనే సానుభూతి చూపారే తప్ప వాళ్లపై ద్వేషాన్ని చూపలేకపోయారు. ఇది కదా మనిషిలో ఉండాల్సిన మానవీయ కోణం!
వెలుగులో ఉన్నంతకాలం చీకటి గుర్తుకే రాదు. చీకట్లోకి వచ్చాకే వెలుగు గుర్తుకొస్తుంది. అమ్మ జ్ఞాపకాలు అంతులేని ఆనందాలు. ఆ జ్ఞాపకాల్లోనూ తప్పని కొన్ని విషాదాలు. ”మా బాదం చెట్టు నుంచి రాలిపోతున్న ఎండిన ఆకు అల్లల్లాడుతూ నేలకు రాలిపోయినట్టు 91 సంవత్సరాల మా అమ్మ నిండు జీవితం చివరికి అల్లాడిపోతూ అలా రాలిపోయింది” అంటూ ఈ ముచ్చట్లను ముగించినప్పుడు ఒక కన్నీటి పొరేదో మీ కళ్ళలో సుళ్ళు తిరుగుతుంది.
– వి. విజయకుమార్‌, 8555802596

Spread the love