– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
– యశోద హాస్పిటల్ సహకారంతో 200 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
నవతెలంగాణ- ఖమ్మం
మూడు రాష్ట్రాల నుంచి ఆరోగ్య చికిత్సలు కోసం వేలాదిమంది పేదలు ఖమ్మం వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం కోసం నగరంలో హైదరాబాద్ నిమ్స్ తరహాలో నూతన హాస్పిటల్ నిర్మించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బివికే కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మంచికంటి హాల్‌లో శనివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల నెలా మెడికల్ క్యాంపు నిర్వహించడం నమ్మకమైన, నాణ్యతకు చిరునామాగా ఈ మెడికల్ క్యాంపు మారింది అని కొనియాడారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ పోస్ట్‌లు చాలా ఖాళీగా ఉన్నాయని, గుండె పరీక్షలు నిర్వహణకు అవసరమైన కాంట్రాస్టు ఇంజెక్షన్‌లు లేక పది రోజులు నుంచి వైద్య సేవలు బంద్ అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగాలకు సిబ్బందిని, డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పెరిగాయని, జిల్లా మంత్రి, అధికారులు కేవలం మాటలకే పరిమితం కాకుండా తగిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో నిమ్స్ తరహాలో హాస్పటల్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్లు, బిజీ జీవనశైలితో ఎన్నో వ్యాధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే కాలంలో మరింతగా ఆధునిక వైద్య సౌకర్యాలు ఈ మెడికల్ క్యాంపులో కల్పిస్తామని ఆయన తెలిపారు. అనంతరం హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా అందించారు. తొలుత డాక్టర్లు అల్లంపాటి రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ వరుణ్, సి.భారవి, పి.సుబ్బారావు, జెట్ల రంగారావు, జి.రాజేష్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, వై.శ్రీనివాసరావు, చంద్రశేఖర్, శివనారాయణ, వాసిరెడ్డి వీరభద్రం, పి.వాసు, అఫ్జల్, పి.కృష్ణారావు, టి.జనార్దన్ స్వామి, టి.వెంకట్రావు, వి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.