నవతెలంగాణ – సిద్దిపేట: సిద్దిపేట అసెంబ్లీ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావుకు మద్దతుగా 18 వ వార్డులో బిఆర్ఎస్ నాయకులు అడ్డగట్ల శేఖర్, అంజిలా ఆధ్వర్యంలో మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మోడల్ ఈవీఎంలను పట్టుకుని రెండో నెంబర్ పై ఉన్న మీటను నొక్కాలంటూ ఇంటింటా ప్రచారం చేస్తూ, ఓటర్లను చైతన్యం చేస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి హరీశ్ రావు తోనే జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన సిద్దిపేట అంటే తెలియని వారు ఉండరని అన్నారు. గతంలో హరీశ్ రావుకు లక్షకు పైగా మెజార్టీ వచ్చిందని, ఈసారి లక్ష యాభై వేల మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటు వేసి మన ఐక్యత చాటుదామని అన్నారు. 18వ వార్డు అభివృద్ధికి మంత్రి ఎన్నో నిధులను కేటాయించారని, అడగగానే ఇక్కడున్న సమస్యలను ప్రతి ఒక్కటి తీర్చారని అన్నారు. మన సమస్యలను తీర్చిన నాయకుడికి మనం అండగా ఉండాలన్నారు. ఇప్పుడు మనం వేసే ఒక ఓటు ఐదు సంవత్సరాలకు మన భరోసాగా ఉంటుందన్నారు. వారం రోజులుగా యువకులతో, మహిళలతో వార్డులో ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈసారి ప్రతిపక్షల వారికి కూడా డిపాజిట్లు రావని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.