– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్
– ఎంఈఓకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట : పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు చెల్లించాలని, జాబ్‌చార్ట్ నిర్ణయించి అమలు చేయాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీఐటీయూ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంఈఓ జగపతి కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ‘స్వచ్ఛమిత్ర’ పేరుతో మహిళలను నియమించి పారిశుధ్య పనులతో పాటు ఎనిమిది గంటల పాటు వివిధ రకాల పనులు చేయిస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రధానోపాధ్యాయుల తో సమానంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు.
స్వచ్ఛమిత్రులకు గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.3 వేల నుంచే చీపుర్లు, ఫినాయిల్, బకెట్లు తదితర పారిశుధ్య పనిముట్ల కొనుగోలుకు కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించాలని, ఉపాధ్యాయుల మాదిరిగానే సంవత్సరంలోని 12 నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలను స్వచ్ఛమిత్రల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయాలని, వారి విధులు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటూ జాబ్‌చార్ట్ రూపొందించి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, కౌలూరి రామకృష్ణ, లీల, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.



