బాలలకు కొత్త ‘బహుమతి’

తెలంగాణ నుంచి బాలలకోసం కథా ప్రక్రియలో రచనలు చేస్తున్న వారి సంఖ్య తక్కువే. నల్లగొండ నుండి ఎంతో కాలంగా బాలలకోసం రచనలు చేస్తున్నారు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. కథను ఎలా ప్రారంభించాలో, కథను ఎక్కడ మలుపు తిప్పాలో, కొసమెరుపు ఎలా ఉండాలో, ముగింపు ఎలా చేయాలో, వినూత్నంగా శీర్షిక ఎలా పెట్టాలో తెలిసిన రచయిత బుచ్చిరెడ్డి. సాహితీమిత్రులు వీరిని కో.బు.రె అని ప్రేమగా పిలుచుకుంటారు.
గతంలో మొలకలు, బంతిపూలు బాలల కథల సంపుటాలు ప్రచురించారు. ‘బహుమతి’ కో.బు.రె తాజా బాలల కథల సంపుటి. ఇందులో 24 కథలున్నాయి. ఈ కథలన్నీ గతంలో ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందినవే. ఇందులో మొదటి కథ ‘పక్షులు నేర్పిన పాఠం’. చివరి కథ ‘అనుకుంది ఒకటి అయింది ఇంకోటి’. భర్త రామచంద్రుడు, భార్య సరోజని ఎప్పుడూ పోట్లాడుకుంటూ పిల్లల బాగోగులు పట్టించుకోవటం మానేశారు. తన ఇంటి ఆవరణలోని చెట్టుమీది పక్షుల జంట ప్రేమగా ఉండటం చూసి సిగ్గు పడతాడు రామచంద్రుడు. భార్యతో ఇక తాగనని, మనం పోట్లాడుకోకుండా సఖ్యతగా ఉండి పిల్లల్ని ప్రేమగా చూసుకుందామంటాడు. భార్యా భర్తలలో మార్పుతీసుకొచ్చిన పక్షుల జంట కథనే ‘పక్షులు నేర్పిన పాఠం’. అవసరమైన చోటకూడా డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడని పిసినారి రామనరసయ్య ఎలా సొమ్మంతా దొంగలపాలు చేసుకున్నాడో తెలిపే కథనే ‘అనుకుంది ఒకటి అయింది ఇంకోటి’. దసరా సెలవులు ఎలా గడిపారో వ్యాసం రాసి అనూష బహుమతి పొందిన వైనం ‘బహుమతి’ కథలో తెలిపారు. ‘గాడిద తెలివి’, ‘కాకివైద్యం’, ‘ఎర్ర కుందేలు’ వంటి అనేక కథలు బాలలకు నీతిని అందిస్తూ, ఆనందం కలిగిస్తాయి.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి శైలి ప్రత్యేకమైంది. కథలు చదువుతుంటే రచయిత తెలంగాణ ప్రాంతం వాడని ఇట్టే తెలిసి పోతుంది. కథలన్నీ తెలంగాణ గట్టుమీద జరిగినవిగా కనిపిస్తాయి. కథల్లో అక్కడక్కడా తెలంగాణ సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తాం. జోర్దార్‌, గమ్మత్తు, బతుకమ్మ, గుబులు, బందు, సాదుకోవటం వంటి అనేక తెలంగాణ పద సంపద ఈ కథల్లో కనిపిస్తుంది.
తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్‌ అందమైన ముఖచిత్రంతో పాటు లోపలి కథలకు ఆకర్షణీయమైన బొమ్మలు వేశారు. ‘బహుమతి’ కథలకు బాలలకు అందిస్తున్న కో.బ.రె కు అభినందనలు.
– పైడిమర్రి రామకృష్ణ, 92475 64699

Spread the love