– అటవీ, పర్యాటకశాఖ కలిసి పని చేయాలి
– ఐఎఫ్‌ఎస్ ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి
– ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం
– కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు : అటవీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆ రెండు శాఖలూ పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అందులో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలసొచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అడవులతో ముడిపడి ఉన్న ప్రకృతి అందాలకు, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక కన్సల్టెన్సీ నియమించి ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లోనే పర్యాటకులు విడిది చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయనీ, వాటిని అధ్యయనం చేసి, అక్కడ అనుసరిస్తున్న రక్షణ, భద్రత చర్యలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని సూచించారు.
ఇతర శాఖలకు డిప్యూటేషన్ వెళ్లిన వారి వివరాలివ్వండి
రాష్ట్రానికి మంజూరైన 81 మంది ఐఎఫ్‌ఎస్ పోస్టుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 26 ఐఎఫ్‌ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చర్చ జరగ్గా.. సరిపడ సంఖ్యలో ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని సీఎం చెప్పారు. అటవీ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లి ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను వెంటనే సమర్పించాలని సీఎం ఆదేశించారు. వసరమైతే వెంటనే వారిని వెనక్కి రప్పించే చర్యలు చేపడుతామన్నారు. ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలనీ, అందుకు వీలుగా బదిలీలపై నిషేధం ఎత్తేయాలని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీల ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. ఉద్యోగుల పిల్లల చదువులకు కూడా ఇబ్బంది లేకుండా వేసవిలోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒక్క అటవీ శాఖలోనే కాకుండా అన్ని విభాగాల్లోనూ చాలా ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను బదిలీ చేసేలా సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు కూడా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
జీరో పొల్యూషన్ సంస్థలకు ప్రశంసాపత్రాలివ్వండి
కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం లాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జీరో పొల్యూషన్ పాటించే సంస్థలకు ప్రశంసా పత్రాలను అందించాలని సూచించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలనీ, ఎక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలకు నోటీసులు ఇవ్వాలనీ, భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు.
అడవుల్లోని ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు పెంచండి
రాష్ట్రంలోని నర్సరీల్లో దాదాపు 22 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. జూన్ లో వర్షాకాలం ఆరంభంలో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అడవుల్లో చెట్ల నరికివేతతో ఖాళీ అయిన ప్రాంతాల్లో మొక్కలు పెంచాలనీ, అవసరమైతే అక్కడే బోర్లు వేయించి నీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆక్రమణకు గురవుతున్న అటవీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ వేసి కాపాడే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి వచ్చే కాంపా నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.