సమయాన్ని సద్వినియోగ పరిచే కవిత

A poem that makes good use of timeకవిత్వానికి జీవితానికి సంబంధం ఉంది. అమ్మ, నాన్నల మీద ఎక్కువగా పోయెమ్స్‌ రాయటం చూస్తుంటాం. అనుక్షణం కంటికి రెప్పలా కుటుంబాన్ని కాపు కాసే జీవితభాగస్వాముల గురించి రాయటం చూస్తుంటాం. మరి ఈ పోయెమ్స్‌ రాయాలని రాస్తుంటరా? ఉద్వేగంతో ఉబికి వస్తాయా?
వాళ్ళ వాళ్ళ జీవిత నేపథ్యాలను తెలియపరచడం కొరకా? జీవిత భాగస్వాములతో వారికున్న అనుబంధమా? అని ఎన్నో ప్రశ్నలు అందరి మనసులో మెదులుతుంటవి. నాకు తెలిసి ఈ పోయెమ్స్‌ వారి మధ్య ఉండే బలమైన బంధానికి నిదర్శనంగా వస్తుంటాయి. నేను అనుకున్న ఈ అభిప్రాయంతో కూడా ఏకీభవించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతి పాఠకుడూ ఆయా సందర్భాలలో వేరు వేరు. ముఖ్యంగా ఇలాంటి పోయెమ్స్‌ రాయటానికి హృదయస్పందనే కారణం. ఈ సందర్భాన్ని ఇచ్చి నగదు బహుమతి ప్రకటించి రాయమన్నా, గొప్ప కవిత వస్తుందని నేనయితే అనుకోను. గొప్ప కవిత సహజసిద్ధంగానే బయటికి వస్తుంది. కానీ కవిత్వపు పాళ్ళు ఉన్నాయో లేవో చూసుకోవటం కవి బాధ్యత. కవిత ఒక్కోసారి అకస్మాత్తుగా రాలిపడే తోకచుక్క కావచ్చు. చాలా సందర్భాల్లో మాత్రం కవి నిలిచిపోయే కవిత కోసం తనను తాను దహించుకోవాల్సిందే. అందుకే కావచ్చు… డిలాన్‌ థామస్‌ కవిత్వాన్ని ఈ విధంగా నిర్వచించాడు: ”కవిత్వం అంటే నన్ను నవ్వించేలా లేదా ఏడ్చేలా చేసేది లేదా ఆవలించేలా చేసేది, నా గోళ్ళను మెరిసేలా చేసేది, ఇది లేదా అది లేదా ఏదైనా చేయాలనుకునేలా చేస్తుంది” అని.
ఈ విషయాలన్ని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వంశీకృష్ణ అనువదించిన ఒడియా కవిత ఫేస్‌బుక్‌ లో కంటబడింది కాబట్టి. ఈ మధ్యకాలంలోనే తమ అమ్మ గారిని కోల్పోవటంతో ఆ తాలూకా జ్ఞాపకాలను అమ్మకు సంబంధించిన కవితల్లో వెతుక్కుంటున్నాడేమో. కవి భావోద్వేగభరితుడు. సున్నిత జీవి. ఏ విషయాన్నయినా సులువుగా మరిచిపోడు.
కలవరిస్తాడు. కలవరిస్తూనే ఉంటాడు. మరో కవి యాకూబ్‌ కూడా తమ అమ్మగారిని కోల్పోవటం మనకు తెలిసిందే. కవులు కాబట్టి ప్రతి విషయాన్ని బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతారు. అందులో నుంచి త్వరలోనే బయటపడుతారని ఆశిస్తున్నాను.
ఇవాళ నేను తీసుకున్న కవిత ఒడియా కవి సీతాకాంత్‌ మహాపాత్ర రాశారు. దానిని తెలుగులోకి వంశీకృష్ణ అనువదించారు. ఇందులో అనువాదం సంబంధిత విషయాల గురించి ప్రస్తావించట్లేదు. కవిత నిర్మాణం చెడిపోకుండా అనువదించినట్టుగా కనబడుతుంది. ఈ కవితను పరిశీలించడాన్నే ప్రధానంగా పెట్టుకున్నాను.
పోయెమ్‌ లోని శీర్షిక కవిత నేపథ్యాన్ని తెలియజేస్తుంది. కవితకు శీర్షిక పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సొస్తుంది కవి. ఇందులోంచి ఒక పదాన్ని వెతుక్కొని శీర్షిక పెడుదామనుకున్నప్పుడు చాలా రకాలుగా ఆలోచించాలి. శీర్షిక కవితకు సంబంధించిన విషయం నుంచి దూరం జరగకుండా చూసుకోవాలి. ఈ కవితకు ‘లేక’ అనేది తగిన శీర్షిక.
ఎత్తుగడలో చెప్పాల్సిన విషయం చెప్పేశాడు. ఒక బాధామయసంఘటనను తీసుకొని కవిత రాస్తున్నాడని ఆ వాక్యాల్లో తేలిపోతుంది. కొంతమంది కవులు ముందే దేన్ని రాస్తున్నామో చెప్పరు. మరికొంతమంది కవులు కొంత దూరం కవితను నడిపించాక ఓపెన్‌ అవుతారు. ఏది ఎలా అయినా కవితను నిర్మించిన విధానంపైనే ఆ కవిత మనుగడ. ఎంత సాధారణంగా ఎత్తుకున్నాడో అంత బిగుతుగా మొదటి యూనిట్‌లోకి ప్రవేశించాడు. పండగనాటి వాతావరణాన్ని చక్కగా సృష్టించాడు. చీకటి మెల్లగా వ్యాపిస్తుందనటం, అల్లరి గాలి ఎదురు చూస్తుందనటం కవితలోపలికి పాఠకుణ్ణి సులువుగా తీసుకెళుతుంది. అర్థం కాని విధంగా పదాలు పేర్చినట్టుగా లేదు. కవిత నిర్మాణం ఎలా చేయాలో తెలిపే ఉదాహరణలను చూపినట్లుగా ఉంది. మళ్ళీ రెండు వాక్యాల్లో ఉద్వేగ స్థితిని ప్రకటించాడు. ఉద్వేగమనేది కవితలో సందర్భోచిత భాగం కావాలి. కవిత మొత్తం ఉద్వేగం కాకూడదు. ఇందులో సమపాళ్ళలో ఉద్వేగతీవ్రతను చూపించాడీ కవి. నాలుగవ యూనిట్‌ కొచ్చేసరికి సాధారణ వాక్యాలను కవిత్వంలోకి పట్టుకొచ్చాడు. ఈ వాక్యాల్లో కవిత్వం లేదు. కానీ కవితాన్వయాన్ని సాధించేందుకు తప్పనిసరిగా ఈ వాక్యాలు ఉండాలి. కవిత రాసేటప్పుడు కొన్ని కొన్ని ఇలాంటి వాక్యాలు రాయటం వల్ల కవిత దారి తప్పదు. ఇక్కడ కూడా పూర్తి కవిత్వం చేయాలనే ఆరాటానికి పోతే మాత్రం కవిత దారి తప్పే ప్రమాదం లేకపోలేదు. ఈ సాధారణ వాక్యాలను అన్వయం కొరకు వాడి, వెంటనే ”ఆకాశం నుండి జారుతున్న నీ ఆశీస్సుల్లా తారాజువ్వల నక్షత్రగుత్తులు” అంటూ మళ్ళీ కవిత్వాన్ని వాక్యాల్లోకి తీసుకొచ్చాడు.
తర్వాతి యూనిట్‌ దగ్గరకొచ్చేసరికి అమ్మ గురించి రాస్తున్నాడా, నాన్న గురించి రాస్తున్నాడా అనే సందేహం కలుగొచ్చు. నేనే అమ్మనుకుంటున్నాను కావచ్చు. కవి నాన్న గురించి రాస్తుండొచ్చు. అయినా ఇద్దరికీ వర్తించేలా నడక సాగింది. పురాతన వాలు కుర్చీ అనే దగ్గర ఆగిపోయాను. అమ్మయితే కూర్చోదా అని సర్ది చెప్పుకున్నాను. మీకనిపిస్తే ఇది నాన్న కవితే అని చదువుకోవచ్చు. నేను ఇప్పటిమటుకు అమ్మనుకునే రాస్తున్నాను. ఇంకా ఇందులో వారికి సంబంధించిన గుర్తులను నవ్వులో వెతుక్కోవటం చేశాడీ కవి. మనం సాధారణంగా ఎవరినయినా కోల్పోయినప్పుడు ‘వాళ్ళు నాతోనే ఉన్నారు, ఇలా మాట్లాడే వాళ్ళు, ఇలా నవ్వించే వారు’ అని అనుకుంటాం. కవి అలాంటి సహజస్థితిని కవిత్వంలోకి తీసుకొచ్చాడు.
పండుగను గుర్తుచేసుకుంటూ మళ్ళీ వచ్చి ఆశీర్వదించాలని అనటం, మనుమడికి అమ్మమ్మలకు, తాతలకు ఉన్న అనుబంధాన్ని చూపటం ఈ కవితలో ప్రత్యేకతను సంతరించుకుంది.
ఎందుకు ప్రత్యేకత అంటున్నానంటే కవి దృష్టికోణం ఎంత లోతైనదో ఈ వాక్యాల్లో అర్థమవుతుంది.
”నీ మొహానికి దగ్గరగా తారాజువ్వలను తీసుకుని వచ్చి
నీ గడుగ్గాయి మనవడు ఇక ఎంత మాత్రమూ
నిన్ను భయపెట్టడు” పరిసరాలను కవి ఎంత బాగా గమనిస్తున్నాడో తెలుస్తుంది.
చివరికి ముగింపులోనూ విశేషం ఉంది. కవితకు ముగింపు ఇవ్వటం సాధారణ విషయం కాదు. ఎంతో శ్రధ్ధ అవసరం. ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడికి వెళ్ళాలి అనే ఎరుక కవికి అవసరం. ఇందులో ఈ కవిది అందెవేసిన చెయ్యి. ఎత్తుగడలో దీపావళి పండుగ వచ్చింది అని ప్రారంభించాడు. ఈ దీపావళికి ఒంటరి అయి పోయాం అనే భావనతో ముగించాడు. అతి కొద్ది మంది కవులలో, కవితల్లో ఇలాంటి ముగింపును చూస్తాం. ఎత్తుగడల్లోంచే ముగింపును పట్టుకొస్తారు. ఇక్కడ ముగింపు సహజంగానే వచ్చినట్టు కనబడింది. ముగింపు కృతకంగా ఉంటే కవిత పట్టాలు తప్పి ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులేమీ లేవు.
ఇంత మంచి కవితను రాసిన ఒడియా కవి సీతాకాంత్‌ మహాపాత్ర, ఈ కవితను అనువదించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వంశీకృష్ణ, ఇద్దరూ మన సమయాన్ని సద్వినియోగపరిచారు. ఇలాంటి ఇతర భాషా కవుల కవిత్వానువాదాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మనమెక్కడున్నామో తెలుసుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి.

లేక
మళ్ళీ దీపావళి పండుగ వచ్చింది
నువ్వు మాత్రం లేవు

మెత్తటి, సున్నిత, ప్రశాంతమైన నీ శ్వాసలా
చీకటి మెల్లగా వ్యాపిస్తోంది
వెలిగించిన దీపాలతో దొంగాట ఆడటానికి
అల్లరి గాలి ఎదురుచూస్తోంది

నువ్వు మాత్రం లేవు
దీపావళి పండుగ మళ్ళీ వచ్చింది

ప్రతి సంవత్సరం లాగే
దీపాలు వెలిగించిన తరువాత
నీ మనుమలు, మనవరాళ్లు
బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు

ఆకాశం నుండి జారుతున్న నీ ఆశీస్సుల్లా
తారాజువ్వల నక్షత్ర గుత్తులు

నువ్వు అలవాటుగా కూర్చునే
ఆ పురాతన వాలు కుర్చీ మీద
ఖాళీతనం కుప్ప పోసుకుని కూర్చుంది
ఆకాశం కంటే విశాలమైన నీ నవ్వు
మెరుపు కంటే కాంతివంతమైన నీ చూపు

వాళ్ళు ఆడుకునే ఆత్మీయమైన పూలకుండీల
ఆటస్థలాన్ని ఎప్పటికీ అంచనా వేయలేవు

మళ్ళీ ఒకసారి దీపావళి వచ్చింది
చీకటిని తొలగించుకుని వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి
వెలుగులో కలిసిపోయే ఒకానొక పూర్వీకుడివి నువ్విక

నీ మొహానికి దగ్గరగా తారాజువ్వలను తీసుకుని వచ్చి
నీ గడుగ్గాయి మనవడు ఇక ఎంత మాత్రమూ
నిన్ను భయపెట్టడు

కలలకి, భయాలకి, ప్రేమకీ
అందనంత దూరంలో నువ్వు

మళ్ళీ ఒక సారి దీపావళి ఇక్కడ
మెరుపులు ఒంటరి నక్షత్రాల్లా నేల దిగుతూ
ఒడియా మూలం : సీతాకాంత్‌ మహాపాత్ర
తెలుగు సేత : వంశీకృష్ణ
– తండా హరీష్‌, 8978439551

Spread the love