బీహార్‌లో ఎన్డీయేకు ఎదురుదెబ్బ

బీహార్‌లో ఎన్డీయేకు ఎదురుదెబ్బ– బీజేపీకి షాకిచ్చిన ఆర్‌ఎల్జేపీ అధ్యక్షుడు
– కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్‌ పరాస్‌ రాజీనామా
– లోక్‌సభ సీట్ల పంపకం విషయంలో కాషాయ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపణ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్జేపీ) అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీట్ల పంపకం విషయంలో తమ పార్టీని పట్టించుకోకుండా బీజేపీ అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. పశుపతి కుమార్‌ వర్గం చేసిన వాదనలను పట్టించుకోకుండా బీహార్‌లో లోక్‌సభ సీట్ల పంపకంలో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ(రామ్‌ విలాస్‌)కి ఐదు సీట్లను కేటాయించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే.. దీనిపై ప్రకటన ఇప్పటికే కూడా చేసింది. అయితే, ఈ అంశంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న పశుపతి కుమార్‌.. ఆ తర్వాతి విలేకరుల సమావేశంలో రోజే కేంద్ర మంత్రి పదవి రాజీనామా ప్రకటనను చేయటం గమనార్హం. అయితే, తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి మాత్రం ఆయన వివరించలేదు. సీట్ల పంపకం విషయంలో తమ పట్ల వ్యవహరించిన విధానంపై తన అసంతృప్తి గళాన్ని వినిపించటానికి ముందు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను ఎన్డీయేకు నిజాయితీగా, విధేయుడిగా సేవలందించాననీ.. అయితే తన పార్టీకి, ప్రత్యేకించి తనకు మాత్రం అన్యాయమే దక్కిందని చెప్పారు.
తదుపరి కార్యాచరణను నిర్ణయించటానికి తమ పార్టీ నాయకులం సమావేశమవుతామని ఆర్‌ఎల్జేపీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ అగర్వాల్‌ తెలిపారు. పశుపతి కుమార్‌ మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తారని మాత్రం స్పష్టం చేశారు.
బాబాయ్, అబ్బాయిల మధ్య బీజేపీ చిచ్చు
లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని వాస్తవానికి కేంద్ర మాజీ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ 2000 ఏడాదిలో స్థాపించారు. 2020లో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. పార్టీని హస్తగతం చేసుకునే విషయంలో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తమ్ముడు పశుపతి కుమార్‌ పరాస్‌, కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ల మధ్య పోటీ నెలకొన్నది. అనంతరం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎల్జేపీ పేరును, చిహ్నాన్ని ఎవరికీ కేటాయించకుండా వాటిని నిలిపివేసింది. తర్వాత పశుపతి కుమార్‌ పరాస్‌ ఆర్‌ఎల్జేపీకి, చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్జేపీ(రామ్‌ విలాస్‌)కి నేతృత్వం వహించారు.
అయితే, అప్పటికే ఎల్జేపీకి ఉన్న ఎంపీలు పశుపతి కుమార్‌ పరాస్‌కు మద్దతిచ్చారు. ఇటు బీజేపీ కూడా ఆ సమయంలో పశుపతి కుమార్‌కు బాసటగా నిలిచి, కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. 2021 నుంచి ఆయన కేంద్ర మంత్రిగా ఉంటున్నారు. అయితే, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్లేటు ఫిరాయించింది. ఇప్పుడు చిరాగ్‌ పాశ్వాన్‌తో సీట్ల ఒప్పందం కుదుర్చుకోవటం గమనార్హం. దీంతో, బీజేపీ బీహార్‌లో బాబారు, అబ్బాయిల మధ్య చిచ్చు పెట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. రాజకీయాల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందనీ, ఇలాంటివి ఒక్క బీహార్‌కు మాత్రమే పరిమితం కాలేదనీ, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది రుజువైందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Spread the love