ప‌దేండ్ల‌కు బ‌లంగా ప్ర‌తిప‌క్షం

A strong opposition for decades– లోక్‌సభలో పెరిగిన సభ్యుల సంఖ్య
– ఫలవంతమైన చర్చలకు ఆస్కారం
– భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికిది చాలా కీలకం
– గత రెండు లోక్‌సభల్లో చర్చలు లేకుండానే బిల్లుల ఆమోదం : రాజకీయవేత్తలు, నిపుణులు
– తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హౌదాలో రాహుల్‌ గాంధీ
– పలు అంశాలపై మోడీ ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం
– కేంద్రం వైఫల్యాలపై నిలదీసిన విపక్ష సభ్యులు
గత పదేండ్ల మోడీ పాలనలో లోక్‌సభలో చర్చలు ఏకపక్షంగా సాగాయి. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వకుండా, వారి అభిప్రాయాలకు ఏ మాత్రమూ గౌరవం లేకుండా  సమావేశాలు జరిగాయి. ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన బిల్లులు అనేకం సభలో తమకున్న సంఖ్యాబలం ఆధారంగా చట్టాలుగా మారినవే. విపక్ష సభ్యుల నుంచి అభ్యంతరాలు,  సూచనలు వచ్చినా.. మోడీ సర్కారు తాను అనుకున్న పనినే చేసేది. ఇందుకు స్పీకర్‌ స్థానాన్ని కూడా దుర్వినియోగం చేసిందనే ఆరోపణలున్నాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో  కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ వంటి పలు కీలక పార్టీల ఇండియా బ్లాక్‌ ఎన్నికల్లో 230కి పైగా స్థానాలు సాధించి.. బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధానపార్టీగా ఉన్న కాంగ్రెస్‌  99 స్థానాలతో అతిపెద్ద భాగస్వామిగా ఏర్పడింది. ఈ లోక్‌సభ సమావేశాల్లో ప్రతిపక్షం అనేక సమస్యలను ప్రస్తావించింది. కేంద్రం వైఫల్యాలను లేవనెత్తింది. మొత్తానికి పదేండ్ల  తర్వాత.. ప్రస్తుతం సభలో ప్రతిపక్షం గొంతు బలంగా వినిపించిందని రాజకీయవేత్తలు, నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతిపక్షం స్థానం చాలా కీలకం. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, వైఫల్యాలను లేవనెత్తుతూ, సమస్యలను సర్కారు దృష్టికి తీసుకొస్తూ శ్రేష్టమైన పాలనలో కీలక పాత్రను వహిస్తుంది ప్రతిపక్షం. గత పదేండ్లలో సభలో.. ప్రతిపక్షాలకు సభలో తగినంత సంఖ్యాబలం లేకపోటం, విపక్షాల మధ్య అనైక్యత, విస్పష్టమైన మెజారిటీ వంటి కారణాలతో మోడీ సర్కారు ఏకపక్ష ధోరణిని అనుసరించింది. దీంతో లోక్‌సభ సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు బలంగా వినిపించలేదని రాజకీయవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్షం గొంతు బలంగా వినిపించటంతో.. దాని ప్రాధాన్యతను దేశ ప్రజలూ గుర్తిస్తున్నారని చెప్తున్నారు.
‘సభలో చర్చలు చాలా కీలకం’
గత పదేండ్లలో మోడీ ప్రభుత్వం సభలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదనీ, సభలో, సభ వెలుపల నుంచి ప్రతిపక్షం, పౌర సమాజం నుంచి వచ్చే ప్రశ్నలు, ఆరోపణలకు స్పష్టతనివ్వకుండా తనకు నచ్చిన విధంగా వ్యవహరించిందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. గత లోక్‌సభలో స్పీకర్‌గా వ్యవహరించిన ఓం బిర్లానే మోడీ సర్కారు మళ్లీ 18వ సభకు స్పీకర్‌గా తీసుకురావటం వెనకున్న ఉద్దేశం ప్రతిపక్షాల గొంతును అణచివేసే చర్యల్లో భాగమేనని వారు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉంటే ప్రభుత్వం వ్యూహాలు ఏమాత్రమూ పని చేయవని సూచిస్తున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న కారణంగా లోక్‌సభలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌ ఎన్నిక అనివార్యమైందనీ, అయితే ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల మైక్రోఫోన్లు కూడా సైలెంట్‌ కావటం పలు అనుమానాలకు తావిచ్చిందని అంటున్నారు. ”భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు చేసే పార్లమెంట్‌ అత్యంత కీలకం. ప్రజా సమస్యలపై మాట్లాడే ఈ వేదికలో చర్చలు అత్యంత కీలకం. ప్రశ్నించటం ప్రతిపక్షం హక్కు. ప్రతిపక్షం, పాలకపక్షం మధ్య నాణ్యమైన చర్చలు జరిగితేనే ఫలవంతమైన విధానాలు, చట్టాలు బటయకు వస్తాయి” అని రాజకీయ నిపుణులు, మేధావులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాన్ని నిందించకుండా, సమస్య పరిష్కారానికి మార్గం చూపే విధంగా ప్రభుత్వం తీరుండాలనీ, అధికార సభ్యులకు చాలా సహనం అవసరమని సూచిస్తున్నారు.
బిల్లుల చర్చకు తక్కువ సమయం
మోడీ పాలనలో గత లోక్‌సభలో కేవలం 16 శాతం బిల్లులే పార్లమెంటరీ కమిటీలకు చర్చలు, పరిశీలన కోసం పంపబడ్డాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ-2 హయాంలో ఇది 72 శాతం కావటం గమనార్హం. గత 17వ లోక్‌సభలో 33 శాతం కంటే ఎక్కువ బిల్లులు గంట కంటే తక్కువ సమయంలోనే చర్చలకు నోచుకొని ఆమోదం పొందాయి. కీలకమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లు, జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం వంటివి రెండు రోజుల్లోనే చట్టాలు మారటం గమనార్హం. అలాగే, గతంలో ఎన్నడూ లేని విధంగా గత లోక్‌సభ సమావేశాల్లో ప్రతిపక్షాలకు చెందిన 141 మంది సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే, మోడీ పాలనలో ఏకాభిప్రాయానికి, చర్చలకు ఆస్కారం లేకపోవటానికి పై ఘటనలే కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు అని రాజకీయవేత్తలు చెప్తున్నారు.
యూపీఏ హయాంలో ఎన్‌ఏసీ
ప్రధానికి సలహాలు ఇవ్వటం కోసం యూపీఏ పాలనలో ఏర్పాటు చేసిన జాతీయ సలహా కమిటీ(ఎన్‌ఏసీ)లో అధికారపార్టీకి చెందినవారికే కాకుండా కాంగ్రెస్‌పార్టీ విమర్శకులకూ స్థానం దక్కిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ), మహాత్మా గాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లారుమెంట్‌ గ్యారెంటీ స్కీం లను తీసుకురావటంలో ఎన్‌ఏసీ కీలక పాత్రను పోషించిందని రాజకీయనిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు చెప్తున్నారు. అయితే, మోడీ పాలనలో మాత్రం అందరినీ కలుపుకొని పోవాలన్న సామాజిక స్పృహ కనబడటం లేదనీ, ఇలాంటి తరుణంలో దేశానికి ప్రస్తుతమున్న బలమైన ప్రతిపక్షం అవసరం అనివార్యమని వారు సూచిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌
పదేండ్ల పాటు అధికారానికేగాక.. ప్రతిపక్ష హౌదాకూ దూరమైన కాంగ్రెస్‌ ఈ సారి బలంగా తయారైంది. 99 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సభలో రాహుల్‌ గాంధీ తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హౌదాను పొందాడు. మోడీ సర్కారును పలు అంశాల్లో నిలదీశాడు. ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తుతూ మోడీ సర్కారు చేస్తున్న మత రాజకీయాలను చర్చకు తీసుకొచ్చాడు. ఇతర విపక్ష సభ్యులు సైతం పలు అంశాల్లో మోడీ సర్కారు తీరును సభలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభ మోడీ సర్కారుకు అంత సులువేమీ కాదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.

Spread the love