తడి ఆరని జ్ఞాపకం…

పొత్తూరి వెంకటేశ్వర్‌రావు గారి గురించి విన డమే తప్ప అప్పటివరకూ ఆయనను ఎరిగిందిలేదు. కానీ మొదటిసారి ఆయనను కలుసుకున్న ఆ సంద ర్భం మాత్రం జ్ఞాపకమై ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అది ప్రజానాట్యమండలి తిరుపతిలో అన్న మయ్య స్మృతిలో ”ఆలాపన” కార్యక్రమం నడుపుతున్న సమయం. ”ఆలాపన” ప్రజా నాట్యమండలి చరిత్రలో ఓ మైలురాయి. తెలుగు కళారంగాన్ని ఓ కుదుపు కుదిపింది. అప్పట్లో దానిపై అనేక ఆసక్తులు, ఆశ్చ ర్యాలు, అనుమానాలు, అభినందనలు..!
”ప్రజానాట్యమండలి అభ్యుదయ మార్గం వీడి ఆధ్యాత్మికమార్గం పట్టిందా..?” అనే అనుమానాలూ, ”అన్నమయ్యలోని అభ్యు దయ కోణాన్ని ఎలుగెత్తుతోంది” అంటూ అభినందనలూ పత్రికల్లో పతాక శీర్షిలుగా, టీవీల్లో చర్చావేదికలుగా వెల్లువెత్తుతు న్నాయి. మరోవైపు వీటితో నిమిత్తం లేకుండా జనం హోరెత్తుతోంది…! అదిగో ఆ హడావిడిలో తల మునకలై ఉండగా వచ్చిందో ఫోన్‌…
”హలో ఎవరండీ..” అడిగాను.. అవతలి వైపు నుంచి
”బాబూ.. నా పేరు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు.. మీరు ప్రజా నాట్యమండలి కార్యదర్శి రమేష్‌ గారేనా..”
నాలో ఒక్కసారిగా ఏదో తెలి యని ఉద్వేగం. అంత పెద్ద మనిషి నాకు ఫోన్‌ చేయడమే మిటీ, ఆయనకు నేనెలా తెలుసూ, నా ఫోన్‌ నంబరు ఎలా తెలుసూ అన్న సందేహాల మధ్య బదులిచ్చాను.
”సర్‌ నమస్కారం.. నేను రమేష్‌నే మాట్లాడుతున్నానండీ..”
”బాబు.. నేను మనవాళ్లంద రినీ కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. వీలవు తుందా?”
ఆయనంతటివారు అడిగితే కాదనగలమా..! అందుకే మరో ఆలోచనే లేకుండా..
”మీరడగమూ మేము కాదనడమూనా… సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం.. ప్రారంభ సభలో మీరు సందేశమిచ్చి వెళ్లచ్చు. తప్పకుండా రండి సర్‌”
”నాకు 6 గంటలకు ట్రైన్‌ ఉంది. ఇప్పుడు మన వాళ్లంతా ఎక్కడున్నారు? ఇప్పుడు కలవడం వీలవుతుందా?”
”సర్‌ ఇప్పుడు ‘పాట- ప్రయోజనం’ అనే ఆంశంపై ఓ చర్చాగోష్టిలో ఉన్నాం..” నేను చెప్పడం ముగించకముందే…
”మరీ మంచింది.. ఇప్పుడు నేను రావొచ్చా..”
”తప్పకుండా రావొచ్చు సర్‌”
”అరగంటలో అక్కడుంటాను.. నాకొక పది నిమిషాల సమయమివ్వండి చాలు..” అని ముగిం చారు. నాలో ఆనందంతో పాటే తెలియని ఆందో ళన.. వెంటనే మిత్రులతో విషయం చర్చించాను. అందరూ సంతోషించారు. అనుకున్నట్టుగా సరిగ్గా అరగంటలో తెలుగుతనానికి నిలువెత్తు రూపంలా అక్కడ ప్రత్యక్షమయ్యారాయన! సాదరంగా ఆహ్వా నించి మాట్లాడమని కోరాం.. ఆయన మాట్లాడటం ప్రారంభించారు..
”పిలవని పేరంటానికి కోరి వచ్చాను. నా వల్ల అంతరాయమేదైనా కలిగితే మన్నించండి. ఎందుకో మిమ్మల్ని కలుసుకోవాలనే బలీయమైన కోరిక నన్నిందుకు ప్రేరేపించింది. అనుమతించినందుకు కృతజ్ఞతలు… తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి సమా వేశాల కోసం ఇక్కడికి వచ్చాను. ఈ రెండు రోజులుగా మీ కార్యక్రమాల పట్ల వ్యక్తమవుతున్న ప్రజా స్పందనను, అనేక అభిప్రాయాలను మీడియా ద్వారా, మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాను. ఈ సంద ర్భంలో నేనిక్కడ ఉండటంచేత నాకీ కోరిక కలిగి ఉండవచ్చు… నిజానికి ప్రజానాట్యమండలితో నాకు ఏ సంబంధమూ లేదు. మీకు నేను ఏమీ కాను. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో కనీసం మీ సభలు, సదస్సుల్లో ఎప్పుడూ అతిథిగా కూడా పాల్గొన్నది లేదు. అయినా ఎందుకో నాలో ప్రజానాట్యమండలి పట్ల ఏదో తెలియని ఆత్మీయత..! ఎంతో సాన్ని హిత్యం..!! ఎప్పుడూ దానితో సంభాషిస్తున్నట్టు గానే ఉంటుంది. నాకు సంబం ధించినదేదో ఇక్కడ ఉందనిపిస్తుంది. బహుశా అది ఈ సమా జానికి చైతన్య మివ్వాలన్న ఆశయం అయి వుండ వచ్చు.. ఈ ప్రజా జీవి తాన్ని ఉన్నతీ కరించా లన్న ఆకాంక్ష కావొచ్చు.. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ధృక్పథం కావొచ్చు.. మార్పు కోసం మీరు పడే ఆరాటంలో ఏదో ఒక మేరకు భాగం కావాలన్న నా తాపత్రయం కావొచ్చు.. అదే నన్నీరోజు ఇక్కడకు చేర్చింది. మీరొక గొప్ప ప్రయత్నంలో ఉండగా మిమ్మల్ని కలిసే ఈ అవకాశం రావడం యాదృ చ్ఛికమే కావొచ్చు.. కానీ నాప్రియనేస్తం ప్రజానాట్య మండలిని ఇప్పటివరకూ ప్రత్యక్షంగా కలుసు కోలేకపోయాననే వెలితిని తీర్చింది ఈ సందర్భం. అభినందనలు బిడ్డలారా.. మీ ఆశయం చాలా గొప్పది.. కొనసాగించండి.. ప్రజానాట్యమండలి తెలుగు ప్రజల ఆస్తి.. దాన్ని కాపాడండి..” అని ముగించారు. అంతే.. ఆ ప్రాంగణమంతా చప్ప ట్లతో మారుమోగింది… పాత్రికేయరంగంలోనే కాదు, తెలుగు సాహితీ వనంలోనూ శిఖర సమా నుడైన అంతటి వ్యక్తి.. తన అభివ్యక్తికి అవకాశ మివ్వండని అడగడంలో కనబరిచిన నమ్రత, ఒక అభ్యుదయ భావజాలాన్ని, ప్రగతిశీల కార్యాచరణను అభినందించడంలో చూపిన నిబద్ధత.. నిత్యం స్ఫూర్తినిస్తూనే వున్నప్పటికీ… ఇప్పుడు ఆయన వర్థంతి సందర్భం ఈ జ్ఞాపకాల తేనెతుట్టెను మరోసారి కదిపింది. తెలుగువారికి ఆయనతో ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో కదా..! ఆ జ్ఞాపకాలకు మరణముంటుందా..?!
(నేడు పొత్తూరి వెంకటేశ్వరరావు నాలుగో వర్థంతి)

– రాంపల్లి రమేష్‌ 9490099038

Spread the love