సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని

– యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్
నవతెలంగాణ-వీణవంక 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మొదటి దశ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల స్థాయిలో బైక్ ర్యాలీలను నిర్వహించినట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, డిటిఎఫ్ మండల అధ్యక్షులు మ్యకమల్ల శ్రీనివాస్ తెలిపారు. పదవి విరమణ అనంతరం ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 2004 జనవరి 1 నుండి ఎన్డిఎ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఉద్యోగుల సమ్మతి లేకుండానే ఏకపక్షంగా తీసుకువచ్చిన నూతన పెన్షన్ విధానం ఉద్యోగుల ఆర్థిక భద్రతకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఉద్యోగి మూలవేతనం నుండి 10 శాతం మినహాయించే నగదును వివిధ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగ సొమ్ముకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. 2014 జూన్ 2న నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్ అమలకు అవకాశం ఉన్నప్పటికీ అధికార ప్రభుత్వం చొరవ చూపలేదన్నారు. ఉద్యోగుల ఐక్య ఉద్యమాల ఫలితంగా రాజస్థాన్, చత్తీస్ గడ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో సిపిఎస్ విధానం రద్దుచేసి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. 30 నుండి 35 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా ఉంటూ ప్రభుత్వ కార్యకలాపాలన నిర్వహణలో, సంక్షేమ పథకాల అమలులో నిర్వి రామ కృషి చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వాలు ప్రతిస్పందించని పక్షంలో ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిటిఎఫ్ మండల కార్యదర్శులు లింగయ్య, సంపత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love