స్నేహితులకు పార్టీ ఇస్తూ దొరికిన జూబ్లీహిల్స్ దోపిడీ కేసు నిందితుడు

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ నెల 11న వ్యాపారి ఎన్ఎస్ఎన్ రాజు ఇంట్లో జరిగిన దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 15 రోజులుగా నిందితుడి కోసం వేటాడుతున్న పోలీసులు తాజాగా శామీర్‌పేట సమీపంలోని ఓ రిసార్టులో స్నేహితులకు పార్టీ ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని సికింద్రాబాద్‌కు చెందిన మోతీరాం రాజేశ్ యాదవ్‌గా గుర్తించారు. దోచుకున్న డబ్బులోంచి రూ. 2.50 లక్షలు ఖర్చు చేసిన కొనుగోలు చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌తోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లో నివసించే ఎన్ఎస్ఎన్ రాజు ఇంట్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రవేశించిన నిందితుడు గర్భిణి అయిన ఆయన కుమార్తె నవ్య మెడపై కత్తిపెట్టి నగదు దోచుకెళ్లాడు. దాదాపు ఆరుగంటలపాటు ఇంట్లోనే ఉన్న నిందితుడు మద్యం తాగి, డబ్బు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు బాధ నుంచి బయటపడేందుకే రాజేశ్ యాదవ్ దొంగతనానికి పూనుకున్నాడు. నిచ్చెన సాయంతో రాజు ఇంట్లోకి ప్రవేశించాడు.
ఇంట్లో ఉన్న నవ్య మెడపై కత్తిపెట్టి పాతి లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఆభరణాలు ఇచ్చే ప్రయత్నం చేసినా తీసుకోలేదు. తనకు నగదు మాత్రమే కావాలని చెప్పి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలతోపాటు రాజు అల్లుడు పంపిన రూ. 8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలతో పరారయ్యాడు. అనంతరం నవ్య ఫోన్ నుంచే క్యాబ్ బుక్ చేసుకుని షాద్‌నగర్ వెళ్లాడు. అక్కడ షాపింగ్ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. అక్కడ దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. షాద్‌నగర్ నుంచి తిరిగి సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో ఉన్న తన నివాసానికి చేరుకున్నాడు. చివరికి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇస్తూ దొరికిపోయాడు.

Spread the love