నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2022 ఆగస్టు 5న పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక స్కూల్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మహమ్మద్ అబ్దుల్ రహీం (20), తండ్రి మహమ్మద్ అమీర్ హుస్సేన్ అనే వ్యక్తి బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన వెంట తీసుకెళ్లినట్లు తేలింది. కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి బాలికను ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉంచి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి ఢిల్లీలో బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలిక వాంగ్మూలం, వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు విచారణ అనంతరం జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ & పోక్సో కేసుల విచారణ కోర్టు) న్యాయమూర్తి డా. సీహెచ్. వి.వి.ఆర్. వరప్రసాద్ నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. శేషు, సూర్యప్రసాద్, ఎస్‌హెచ్‌ఓ వై. నరేష్, ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అభినందించారు. “చిన్నారులపై దారుణాలకు తావులేదు.. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరు” అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.



