సంగారెడ్డి డిపీఓపై చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో కలెక్టర్ కు సీసీఆర్ వినతి

నవతెలంగాణ-సంగారెడ్డి: గ్రామపంచాయతీలలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్న సంగారెడ్డి డీపీఓ పై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి సిసిఆర్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్, వెల్టూరు గ్రామాలతో పాటు కొండాపూర్ మండలం సిహెచ్ కోనాపూర్ గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై సమాచార హక్కు చట్టం ప్రకారం సిసిఆర్ తరఫున రికార్డులను పరిశీలించామని వారు తెలిపారు. రికార్డుల పరిశీలన అనంతరం సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామపంచాయతీలో రూ.1,52,44,797లు, వెల్టూర్‌ గ్రామ పంచాయతీలో రూ.1,30,85,713లు, కొండాపూర్‌ మండలం సిహెచ్‌ కోనాపూర్‌ గ్రామ పంచాయతీలో రూ.73,06,819లు అవినీతి జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ మూడు గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిని గురించి పూర్తి ఆధారాలతో గతంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డీపీఓకు కౌన్సిల్‌ ఫర్‌ సిటిజన్స్‌ తరఫున నివేదికలను ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీల్లో అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ అవినీతిపరులకు కొమ్ము కాస్తున్న డీపీఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీసీఆర్‌ ప్రతినిధులు కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన వారిలో సీసీఆర్ రికార్డుల పరిశీలన విభాగం రాష్ట్ర ఇంచార్జ్ ఎస్ ప్రభు, ఉమ్మడి మెదక్ జిల్లా మీడియా ఇన్ఛార్జి ఎండి అహ్మద్, సీసీఆర్ ప్రతినిధులు అశోక్, రాము, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love