రుణమాఫీ ప్రతి రైతుకూ అందే వరకు చర్యలు

– జీఓ 59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తాం
– ప్రభుత్వ సీఎస్‌తోవీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌
నవతెలంగాణ-పాల్వంచ
రైతు రుణమాఫీ చివరి రైతుకూ అందే వరకు చర్యలు తీసుకుంటామని, జీఓ 59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు, హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి పంట రుణాలు మాఫీ, నూతన రుణాలు మంజూరు, ఎరువుల సరఫరా, జీఓ 58, 59, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సోషల్‌ వెల్ఫేర్‌ ఇంటి పట్టాలు, తెలంగాణకు హరితహారం, పంచాయతీ భవనాల నిర్మాణం, ఆయిల్‌ పామ్‌ సాగు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ ఐడీఓసీ మినీ సమావేశపు హాలు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఎరువుల లభ్యత, ఆసరా ఫించన్‌, ఇంటి పట్టాల పంపిణీ, గృహలక్ష్మి, జీఓ 58, హరితహారం, పంచాయతీ భవనాల నిర్మాణం, హరితహారం, ఆయిల్‌ పామ్‌ వంటి పలు అంశాలపై కలెక్టర్‌లకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… బ్యాంకర్ల నుంచి గ్రామాల వారీగా రుణమాఫీ వివరాలు సేకరించి వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీతో పాటు నూతన రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. బ్యాంకర్లు నుంచి గ్రామాల వారీగా రుణమాఫీ వివరాలు సేకరించి వ్యవసాయ విస్తరణ అధికారులచే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్టోబర్‌ మాసం నాటికి కేటాయించిన మేర ఆయిల్‌ పామ్‌ సాగు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేస్తామని కలెక్టర్‌ సూచించారు. రైతులకు సకాలంలో ఎరువులు లభించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59కి సంబంధించి అర్హులందరికీ పట్టాలు పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించి జిల్లాకు కేటాయించిన ఇండ్లకు లబ్దిదారులను త్వరితగతిన ఎంపిక చేసి, రెండు వారాల్లో ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్‌ తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు గ్రౌండింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, అటవీ అధికారి కిష్టా గౌడ్‌, డిఆర్డీఓ మధుసూదన్‌ రాజు, డీఆర్వో రవీంద్ర నాధ్‌, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఎల్డిఎం రామిరెడ్డి, ఆర్డిఓలు శిరీష, మంగిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love