అన్నం పెట్టండి

– భోజనం కోసం విద్యార్థుల భిక్షాటన
– ఖాళీ ప్లేట్లతో టీయూ మెయిన్‌ గేట్‌ ఎదుట నిరసన
– నిరవధిక సమ్మెలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది
నవతెలంగాణ-డిచ్‌పల్లి
‘అన్నం పెట్టండి’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేశారు. టీయూలోని మెస్‌వర్కర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో మూడు రోజులుగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దాంతో టీయూ విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం పెట్టకపోవడంతో జాతీయ రాహదారి పక్కనున్న నడ్పల్లి తండాలో ఇంటింటికీ వెళ్లి.. ‘అమ్మా.. అన్నం పెట్టండి’ అంటూ విద్యార్థులు భిక్షాటన చేశారు. అంతకుముందు విద్యార్థులు టీయూ మెయిన్‌ గేటు ఎదుట ఖాళీ ప్లేట్లతో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. వీసీ నిర్లక్ష్యం వల్ల ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు రాక నిరవధిక సమ్మె చేస్తున్నారని, దాంతో యూనివర్సిటీలో ఉన్న 650 మంది విద్యార్థులు అన్నం లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే వైస్‌ ఛాన్స్‌లర్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే అవినీతి వీసీని బర్తరఫ్‌ చేసి యూనివర్సిటీని కాపాడాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
4వ రోజుకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె..
తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మె గురువారం 4వ రోజుకు చేరుకుంది. 273 మంది సిబ్బంది టీయూ పరిపాలన భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్‌ల నిర్లక్ష్యంతో మే నెల వేతనాలు 15 రోజులు గడుస్తున్నా నేటికీ అందలేదని యూనివర్సిటీ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ప్రతినిధులు సురేష్‌, బికోజీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైస్‌ ఛాన్స్‌లర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు అందడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఒకరిని, పాలకమండలి మరొక రిజిస్ట్రార్‌ను నియమించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వేతనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు అందేలా చూడాలని కోరారు. బుధవారం యూనివర్సిటీకి వచ్చిన వైస్‌ ఛాన్స్‌లర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు ఘెరావ్‌ చేయగా గురువారం వేతనాలు చెల్లించే విధంగా చూస్తానని హామీనిచ్చినా మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love