ఆదిభట్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ కామండ్ల యాదగిరి.?

– ఛైర్మన్, వైస్ చైర్మన్ రెండూ కాంగ్రెస్ కే
– చేతులెత్తేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు!
– కొంగరకలాన్ కు మొండిచేవి చూపిన ఇరు పార్టీలు
– ముందస్తు ఒప్పందం తప్పిన వైనం
– కొంప ముంచిన కొంగరకలాన్ కౌన్సిలర్ల ఆధిపత్య పోరు
– యాదగిరి కోసం తప్పుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్
– ఐదుగురు కౌన్సిలర్లున్న ఒక్క పదవి దక్కించుకోని వైనం..
– కొంగరకలాన్ ప్రజల నుంచి విమర్శల వెల్లువ
– శనివారం ఉదయం 11 గంటలకు తేలిపోనున్న ఫలితం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి
ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్గా మర్రి నిరంజన్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కానున్న నేపథ్యంలో వైస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కామండ్ల యాదగిరి ఎన్నిక దాదాపు ఖరారు అయినట్లే. ముందస్తు ఒప్పందాన్ని తప్పి.. రెండు పదవులు కాంగ్రెస్కే కట్టబెడుతున్న వైనం ఆదిభట్లలో చోటు చేసుకుంటుంది. మెజార్టీ సభ్యులున్న బీఆర్ఎస్, అందులోనూ కొంగర కలాన్ కౌన్సిలర్ల మధ్య గ్రూపు గదాలతో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు పక్క పార్టీ సభ్యులకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందా..? అవుననే విశ్వాసనీయ సమాచారం. ఆదిభట్ల మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లకు గాను ప్రస్తుతం పాలకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాన బలం ఉన్నది. బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గోపగల్ల మహేందర్, వనం శ్రీనివాస్, కోరే కళమ్మ, నగేష్, మౌనిక, కృష్ణంరాజు ఉన్నారు. అటు కాంగ్రెస్లో మౌనిక, అర్చన, లావణ్య, నిరంజన్ రెడ్డి, హరిదాస్, యాదగిరి, ఆర్థిక ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి పొట్టి రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో కోరే కళమ్మ, కొత్త ఆర్థిక ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. వీరి ఇరువురు ఇన్నాళ్లు చైర్మన్, వైస్ చైర్మన్ గా కొంగరకలాన్, ఆదిభట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు కలిసి అవిశ్వాసంతో దింపేశారు. అయితే ఆ సందర్భంగా కుదిరిన ఒప్పంద ప్రకారం చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ తీసుకోవాలి. నిన్నటి వరకు కొనసాగిన కలమ్మకే వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నేడు జరగనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కోరే కలమ్మకు మరోసారి అవకాశం ఇవ్వవద్దని కౌన్సిలర్లు అందరూ ముక్తకంఠంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అదే పార్టీకి చెందిన గోపగల్ల మహేందర్, మనం శ్రీనివాస్ మధ్య వైస్ చైర్మన్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సైతం తనకు అవకాశం కల్పించాలని కామండ్ల యాదగిరి సైతం పట్టుబడుతున్నారు. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరుతో వైస్ చైర్మన్ గా పోటీలో నుంచి గోపగల్ల మహేందర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాంతో బీఆర్ఎస్ వనం శ్రీనివాస్, కాంగ్రెస్ కామండ్ల యాదగిరి మధ్య పోటీ నెలకొంది. ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురి మధ్య డ్రా వేసినట్లు తెలుస్తోంది. ఆ తీసిన డ్రా విధానంలో వైస్ చైర్మన్ గా కామాండ్ల యాదగిరికి వరించినట్లు వినికిడి. దాంతో కామండ్ల యాదగిరిని వైస్ చైర్మన్ చేసేందుకు కౌన్సిలర్లు అంచనాకు వచ్చినట్లు సమాచారం.
కొంగర కలాన్ కు మంది ” చెయ్యి “
ఆదిభట్ల మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో కొత్త ఆర్ధిక, గోపగల్ల మహేందర్, మనం శ్రీనివాస్, ప్రభుదాస్, నగేష్ ఐదుగురు కౌన్సిలర్లు కేవలం కొంగరకలాన నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెజార్టీ సభ్యులు కలిగిన కొంగరకలానికే చైర్మన్ అవకాశం కల్పించింది. ఆ తర్వాత అత్యధిక సభ్యులు కలిగిన ఆదిభట్లకు వైస్ చైర్మన్గా కోరే కలమ్మను ఎన్నుకున్నారు. కానీ వీరిని అవిశ్వాసం ద్వారా పదవి నుంచి దింపేశారు. అయితే కొంగరకలాన్ నుంచి ప్రాతినిధ్యం వయసున్న చైర్మన్ ఆర్థికను దింపేసినప్పటికీ.. కనీసం వైస్ చైర్మన్ పదవి నైనా తమ గ్రామానికి వరిస్తుందిలే అన్న ఆశలు కొంగరకలాన్ ప్రజల్లో ఆశలు నెలకొన్నాయి. కానీ కౌన్సిలర్ల ఆదిపత్య పోరు కారణంగా ఉన్న చైర్మన్ పదవి పోయినా.. కనీసం వైస్ చైర్మన్ కూడా వచ్చే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. దాంతో గ్రామస్తులు సదరు కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఉన్న ప్రధమ పౌరుడి స్థానం కోల్పోయిన ద్వితీయ స్థాయి కలిగిన వైస్ చైర్మన్ పదవిని తెచ్చుకోలేని కొంగర కలాన్ కౌన్సిలర్ల నిర్ణయం పట్ల భగ్గుమంటున్నారు. ఇంతమంది కౌన్సిలర్లు ఉండి కూడా ఒక్క పదవిని తెచ్చుకోకుడా కొంగర కలాన్ పరువును బజారున పెట్టారని మండిపడుతున్నారు. కనీసం బీఆర్ఎస్ లో వర్గ పోరు ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్కైనా వైస్ చైర్మన్ ఇచ్చి కొంగరకలాన్ పరువు కాపాడాలని, ఆ ప్రయత్నం గ్రామ కౌన్సిలర్లు చేయాలని సూచిస్తున్నారు. చివరికి మెజార్టీ కలిగిన కొంగరకలాన్ కౌన్సిలర్లు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారన్నది శనివారం ఉదయం 11 గంటలకు తేలిపోనుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.
Spread the love