సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం. ఆయన కెరీర్‌లో నాలుగో చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఆదికేశవ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ని ఖరారు చేసిన విషయం విదితమే.
ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ ఇటీవల చిత్ర బృందం రిలీజ్ చేసిన ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ అందర్నీ అలరించడంతోపాటు సినిమాపై అంచనాలనూ పెంచింది. ఈ గ్లింప్స్‌లో పంజా వైష్ణవ్ తేజ్ ‘రుద్ర’గా పరిచయం అయ్యాడు.
ఒక చిన్న గ్రామంలో గూండాలు శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తుండగా, రుద్ర వారిని అడ్డుకోవాలనుకుంటాడు.
అయితే ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తిని కలిగించేలా గ్లింప్స్ ఉంది. రుద్రగా పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం చూపించారు. అందమైన చిత్ర పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ కనిపించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో ఆయన అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.