గోదావరి నేపథ్యంలో సాగే అందమైన కథ

రక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ‘శశివదనే’.
గోదావరి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. గౌరి నాయుడు సమర్పణలో ఎస్‌.వి.ఎస్‌. కన్‌స్ట్రక్షన్స్‌ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్‌ కంపెనీ పతాకాలపై సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది.
ఈ చిత్రంలో ప్రవీణ్‌ యండమూరి, తమిళ నటుడు శ్రీమాన్‌, కన్నడ నటుడు దీపక్‌ ప్రిన్స్‌, జబర్దస్త్‌ బాబీ కీలక పాత్రల్లో నటించారు.
ఇటీవల నిర్మాత అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ టైటిల్‌ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోను గమనిస్తే, కోమలి ప్రసాద్‌ దేవుడికి పూజ చేసి తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ప్రేమికుడు ఇంటి దగ్గరకు వచ్చాడని తెలియగానే ఆనందంతో మేడ పైకి పరుగులు తీస్తుంది. ప్రోమో చాలా నేచురల్‌గా, కలర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. హరి చరణ్‌, చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటను సినిమాలో తొలి పాటగా అలరించనుంది. శ్రవణ వాసుదేవన్‌ సంగీతం అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం ట్యూన్‌కు తగ్గట్లు అందంగా ఉన్నాయి. ‘శశివదనే’ పూర్తి టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ ఫిబ్రవరి1న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ వింటేజ్‌ మెలోడి తప్పకుండా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. కోనసీమ, అమలాపురం తదితర ప్రాంతాల్లో 50 రోజులకు పైగానే ఈ సినిమాను చిత్రీకరించారు. ప్రేమకథల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ వాటితో పోలిస్తే ఈ సినిమా కచ్చితంగా భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ చిత్రానికి ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌, సి.ఈ.ఓ: ఆశిష్‌ పెరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీపాల్‌ చోలేటి, సినిమాటోగ్రాఫర్‌: సాయికుమార్‌ దార, పాటలు: కిట్టు విస్సా ప్రగడ, కరుణాకర్‌ అడిగర్ల, మ్యూజిక్‌: శ్రవణ వాసుదేవన్‌, స్టంట్స్‌: జాషువా – జీవన్‌, కాస్ట్యూమ్స్‌ – సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రైటర్‌ – డైరెక్టర్‌: సాయి మోహన్‌ ఉబ్బన.

Spread the love