– ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని గిరిజన జాతులు ఐక్యంగా ఉద్యమించాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అశ్వారావుపేట మండలంలోని పండువారిగూడెం గ్రామంలో టీఏజీఎస్ (తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం)ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సంఘం బాధ్యులు మడకం గోవిందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రతి గిరిజనుడు చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పంచాయతీ (షెడ్యూల్డ్ ఏరియాస్) విస్తరణ చట్టం (PESA), జీవో నెం.3, అటవీ హక్కుల చట్టంలను సమర్థవంతంగా అమలు చేయించడంతో పాటు వాటి రక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మడివి దుర్గారావు, మల్లయ్య, శీసం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



