– ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి నివాళులు
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌ను అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆదివారం అధికారికంగా సందర్శించారు. బెటాలియన్ వద్దకు చేరుకున్న డీజీపీకి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో ఆదివాసీ సమాజం పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
అనంతరం బెటాలియన్‌లోని ఎంటీ గ్యారేజ్, ఆడిటోరియం, బీటీసీ ట్రైనింగ్ సెంటర్‌లను పరిశీలించారు. వీటితో పాటు బెటాలియన్ ప్రధాన కార్యాలయం, మెన్ క్వార్టర్స్, ఫైరింగ్ రేంజ్‌లను తనిఖీ చేశారు. ఆయా విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బెటాలియన్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేలా పలు కీలక సూచనలు చేశారు. అనంతరం బెటాలియన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయిలో తగిన కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శిక్షణా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పోలీస్ దళాల క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధతను ఎల్లప్పుడూ చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 15వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎన్ పెద్దబాబు, అదనపు దళాధిపతి ఎ అంజయ్య, సహాయ దళాధిపతి బి వేణుగోపాల్ రెడ్డి, ఆయా విభాగాల ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



