– జులై 24న విచారిస్తామన్న సుప్రీం
– మరోసారి వాయిదాలు కోరవద్దని ప్రతివాదులకు ఆదేశం
– ఏమైన అంశాలుంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు జులై 24కు వాయిదా వేసింది. అయితే జులై 24న తరువాత మరోసారి వాయిదాలు కోరవద్దని తెలంగాణ ప్రభుత్వం, చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించింది. ఈ కేసులో టీడీపీి అధినేత చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయి ంచారు.ఈ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్ వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్, చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా, పిటిషనర్ ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్లు హాజరయ్యారు. కేసు విచారణ ప్రారంభం కాగానే ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన ధర్మాసనం, ఇంకెంత సమయం కావాలని ప్రశ్నించింది.
ఇందుకు రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మేనకా గురుస్వామి కోర్టుకు నివేదించారు. మరోవైపు చంద్రబాబు తరపు సిద్దార్థ లూత్రా జోక్యం చేసుకొని తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు నేపథ్యంలో వాదనలు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల వేసవి సెలవుల తరువాత వాదనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ వాదనలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది బసంత్ అభ్యంతరం తెలిపారు.
ఈ కేసు 2015లో జరిగిన వ్యవహారమని, అప్పుడు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై విచారణ పెండింగ్లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏదో ఒక సాకుతో ప్రతిసారి ఇలాగే కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోందని, అందుకే త్వరితగతిన విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇన్నేండ్లుగా కేసు విచారణ సాగుతోందని చెబుతున్నారని, అలాంటప్పుడు రెండు వారాల్లోనే ఏమీ ఆగిపోదు కదా? అని ప్రశ్నించింది. అయితే మరోసారి ఈ కేసులో వాయిదాలు కోరవద్దని ప్రతివాదులకు స్పష్టం చేసింది. జులైౖ చివరి వారంలో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏమైనా అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావాలనుకుంటే, వాటిని రాత పూర్వకంగా సమర్పించాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 24కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.