నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా మరియు వివిధ సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
యూనివర్సిటీలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) కోర్సులతో పాటు పీజీ స్థాయిలో ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎంకాం, ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రం), ఎంఎల్‌ఐఎస్‌సీ, డిప్లొమా మరియు పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.
భారత పౌరులు తమకు ఉన్న కనీస అర్హతల ప్రకారం ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. అయితే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోని అధ్యయన కేంద్రాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు, ఫీజుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్లలో పొందవచ్చని వెల్లడించారు.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అలాగే పదో తరగతి తర్వాత రెండేళ్ల డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఇప్పటికే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు, అలాగే పీజీ కోర్సుల్లో కొనసాగుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజులను ఆగస్టు 7, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని అధికారులు సూచించారు. డిగ్రీ 2021-22 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెందిన రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు, అలాగే పీజీ 2023-24 నుంచి 2025-26 బ్యాచ్‌ల విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించని పక్షంలో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా టీఎస్ ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
అడ్మిషన్లు, ఆన్‌లైన్ నమోదు, ఫీజుల చెల్లింపు తదితర అంశాలపై సందేహాలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. అలాగే విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్ నంబర్లు 7382929570, 040-23680222, 040-23680333, 040-23680555 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-0101ను సంప్రదించవచ్చని తెలిపారు.



