అద్దంకి దయాకర్‌ కి హైకోర్టులో జరిమానా

నవతెలంగాణ -హైదరాబాద్‌: ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ ఎన్నికపై దాఖలైన పిటిషన్‌లో అడిగిన పత్రాలను సమర్పించని తుంగతుర్తి కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అద్దంకి దయాకర్‌ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గడువులోగా డాక్యుమెంట్‌లను సమర్పించనందున రూ.3 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అద్దంకి దయాకర్‌ 2018 ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, గాదరి కిశోర్‌ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ సోమవారం విచారణ చేపట్టారు. పోలింగ్‌ ఏజెంట్‌లకు 17సి కింద ఇచ్చిన ఫారాలను అందజేయాలని దయాకర్‌కు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా గడువు కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తగిన గడువు ఇచ్చినా డాక్యుమెంట్‌లు సమర్పించకుండా గడువు కోరడంతో రూ.3 వేలు చెల్లించాలని దయాకర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదావేశారు.

Spread the love