View this post on Instagram
నవతెలంగాణ-హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని ఘనంగా చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరిలోనూ దేశభక్తి పొంగిపొరలింది. ఆ తర్వాత ఎవరి జీవితాలతో వారు బిజీ అయిపోయారు. తాము ఎంతో సగర్వంగా ఎగరేసిన జాతీయ జెండాలను గాలికి వదిలేశారు. దీంతో రోడ్ల మీద, కాలవల్లోనూ ఎక్కడ పడితే అక్కడ త్రివర్ణ పతాకాలు దర్శనమిచ్చాయి. అలా కాలవలో పడి కొట్టుకుపోతున్న జాతీయ జెండాలను చూసి ఓ కుర్రాడి మనసు చలించిపోయింది. స్వయంగా కాలవలోకి దిగి ఆ జెండాలను బయటకు తీశాడు. నిజమైన దేశభక్తి అంటే ఏంటో చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. zindagi.gulzar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మురికి కాలవలో బోలెడన్నీ జాతీయ జెండాలు పడి ఉన్నాయి. ఓ వ్యక్తి చిన్న కుర్రాడిని కాలవలోకి దించాడు. ఆ కుర్రాడు కాలవలో పడి ఉన్న ప్రతి జెండాను పట్టుకుని బయటకు తెచ్చాడు. కేవలం కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. 65 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోలోని కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆ చిన్నారికి సెల్యూట్’, ‘ఒక్క రోజులోనే దేశభక్తి కాలవలోకి వచ్చేసింది’, ‘జెండాలను అందరికీ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి’, ‘ఆ చిన్నారికి ఉన్న జ్ఞానం పెద్దలకు లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.