రైతు బంధుపై సలహాలు.. సూచనలు..

– సేకరణ ప్రత్యేక  మహాసభ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలో చందుపట్ల పి ఎస్ సి ఎస్ బ్యాంకు పరిధిలో ఎనిమిది గ్రామాల రైతుల నుంచి చందుపట్ల రైతు వేదికలో రైతు భరోసా పై సలహాలు సూచనల పై బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ హాజరై,  మాట్లాడారు. ఈ ప్రత్యేక మహాజన సభ సమావేశంలో రైతు భరోసా (రైతుబంధు)పై   సంఘ రైతు సభ్యులు సాగుబడి చేయుచున్న భూములు, వ్యవసాయం చేస్తున్న భూములు మరియు దున్నిన వారిదే భూమి అన్నట్టుగా , దున్నిన  భూమికే రైతు భరోసా (రైతు బంధు) ఇవ్వాలని, ఒక పంట దున్నీన, మరొక పంట ఖాళీగా ఉంచిన మొత్తం మీద దాదాపుగా 10 ఎకరాలు వరకు భూములు ఉన్నవారికి , ఇన్కమ్ టాక్స్( I.T) ఒక లక్ష రూపాయలు లోపు చెల్లించే వారికి,  ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీ లు, జడ్పిటిసిలు, ప్రభుత్వ ఉద్యోగులు కిందిస్థాయి అధికారులకు రైతు భరోసా అమలు చేయుటకు సభ్యులందరూ అభిప్రాయాలు తెలియజేసినట్లు తెలిపారు. కొండలకు, గుట్టలకు, ప్లాట్లకు, నాలా కలెక్షన్ ఉన్నవాటికి, భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని,  ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపి, ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, విదేశాలలో స్థిరపడిపోయిన వారికి రైతు భరోసా (రైతుబంధు) ఇవ్వకూడదని రైతులందరూ తెలిపారు. గత ప్రభుత్వం భూములు ఉన్న రైతులందరికీ రైతు బంధు పథకం వర్తింపజేసి, విమర్శలు ఎదుర్కొందనీ, ఈ రైతు భరోసా పథకం పై నియమ నిబంధనలు, అమలుపై నేటి ప్రభుత్వం మరియు అధికారులు వారే  నిర్ణయించాలని కొద్దిమంది రైతుసభ్యులు తెలిపారు.
అనంతరం బ్యాంక్ అధ్యక్షులు  మందడి లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతి గింజకు మద్దతు ధర ఎలా వర్తిస్తుందో, దున్నిన ప్రతి ఎకరానికి, సాగు చేస్తున్న భూములకు రైతు భరోసా (రైతుబంధు) వర్తించాలి అన్నట్టుగా, రైతుబంధు పథకం భూములకు  అకౌంట్లో వేసే డబ్బులకు బదులు రైతులు సాగుబడి చేసి నేలను సారవంతం చేసి వ్యవసాయ చేస్తూ పంటలు పండిస్తూ వారి, అభివృద్ధికి తోడ్పడుతూ, సాగు రైతుల మేలు కోసం, రైతులందరికీ చేయూతగా, అన్నదాత సుఖీభవ అన్నట్టుగా రైతుల అభివృద్ధి కోసం వరి పంటలకు మద్దతు ధర మరియు అలాగే వాణిజ్య పంటలు కందులు, పెసలు, పత్తి ఇతర మరియు పాడి పరిశ్రమ రంగాన్నీ అభివృద్ధి చేసుకోవడానికి పాలకు మద్దతు ధరతో పాటు, బోనస్ గా 500/-  బదులు రూ.1,000/-  బోనస్ ప్రకటిస్తే రైతు భరోసా (రైతుబంధు) పథకం  అవసరం ఉండదు అని, రైతులు తమ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని, కష్టే:ఫలే అన్నట్టుగా వర్తిస్తుందని, రైతులకు లాభం చేకూరుస్తుందని తెలిపారు.  ఈ ప్రత్యేక మహాజన సభ సమావేశములో సంఘం పాలకవర్గ సభ్యులు, జిల్లా సహకార శాఖకు సంబంధించిన సీనియర్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి, పి ఎ ఎస్ ఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Spread the love