కేసీఆర్ కు దెబ్బ మీద దెబ్బ..బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురేనా..?

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఇటివల పార్లమెంట్ ఎన్నికల్లో విఫలమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. పార్టీలోని కీలక నేతలు క్రమంగా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లగా, శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2023 వరకు వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం విశేషం. ఆ క్రమంలోనే పోచారం తెలంగాణ ప్రభుత్వంలో 2014-2019 వరకు వ్యవసాయ మంత్రిగా, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, కేకే, కడియ శ్రీహరి, కడియం కావ్యాలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇంకొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోచారంతో సీఎం భేటీపై ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి స్పందించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ పార్టీని ముంచాయని వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని దానం అన్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. ఇక చేరనున్న వారిలో కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఉన్నారని చెప్పారు. దీంతోపాటు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని అన్నారు. మరోవైపు హరీష్ రావుతో కలిసి పలువురు బీజేపీకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు నేతలు వెళ్లి పోతే ఇక చివరికి మిగిలేది కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్ రావు మాత్రమే మిగిలే విధంగా అనిపిస్తుంది

Spread the love