– రెజ్లింగ్‌లో ఇరాన్ మల్లయోధుల గొప్ప ప్రదర్శన
– 18 పతకాలతో ఆసియా రెజ్లింగ్‌లో అగ్రస్థానం
జాతీయ రెజ్లింగ్ స్టేడియంపై అమెరికా, ఇజ్రాయిల్ బాంబు దాడి. నిత్యం కుస్తీ సాధన చేసే మల్లయోధుల శిక్షణ కేంద్రం నేలమట్టమైంది. ఎంతో మంది రెజ్లర్లు ఆశ్రయం కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమంలో కుటుంబ సభ్యులను, ఆత్మీయులు దూరం అయ్యారు. యుద్ధంలో సర్వం కోల్పోయినా… దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా సాధించాలనే తపన రెజ్లర్లను నేడు నేషనల్ స్టార్స్‌ను చేసింది. సాధనకు సురక్షిత సెంటర్ లేని దుర్బర పరిస్థితుల్లో, టోర్నీలో పోటీపడేందుకు విమాన ప్రయాణం చేయలని నిస్సహాయ స్థితి నుంచి ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇరాన్ ఏకంగా 18 పతకాలు సాధించింది. ఆసియా రెజ్లింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఈ ఏడాది మార్చిలో మొదలైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం వేల మంది ప్రజల ప్రాణాలను తీసింది, లక్షలాది మంది ప్రజలను క్షతగాత్రులను చేసింది. ప్రజల నివాసాలను, ప్రభుత్వ భవనాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఈ మారణహోమం ఇరాన్ రెజ్లర్లను సైతం విడిచిపెట్టలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని రెజ్లింగ్ సెంటర్ ఆజాదీ ఇండోర్ స్టేడియం బాంబు దాడిలో నేలమట్టమైంది. ఏప్రిల్ ఆరంభంలో ప్రతిష్టాత్మక ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ పోటీలు. సాధన చేసేందుకు అందుబాటులోని కుస్తీ కేంద్రం కుప్పకూలటంతో రెజ్లర్లకు ఏం చేయాలో తెలియని సంకట స్థితి. ప్రజల ప్రాణాలు కాపాడుకోవటమే అతిపెద్ద సమస్యగా మారిన తరుణంలో.. యుద్ధభీతిలో ఉన్న దేశ ప్రజల కోసం కుస్తీ వీరులు పట్టు బిగించారు. చర్రిత ఎరుగని గడ్డు పరిస్థితుల్లో రెజ్లింగ్ సాధన చేయటంతో పాటు ఆసియా పోటీల్లో ఇరాన్‌ను అగ్రస్థానంలో నిలిపారు. కిర్గిస్గాన్‌లో జరిగిన 2026 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇరాన్ 6 పసిడి, 6 రజత, 6 కాంస్య పతకాలతో 18 మెడల్స్ సాధించింది. యుద్ధంలో అన్నీ కోల్పోయిన ఇరాన్ ప్రజలకు దంగల్ హీరోల స్ఫూర్తిదాయక ప్రదర్శన గొప్ప ఊరట కలిగిస్తోంది!.
ట్రైనింగ్ కోసం తిప్పలు
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ కోసం టెహ్రాన్‌లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కానీ బాంబు దాడిలో స్టేడియం కుప్పకూలింది. టెహ్రాన్‌లోని ఇతర స్పోర్ట్స్ సెంటర్స్ సైతం బాంబుల దాడిలో ధ్వంసం అయ్యాయి. దీంతో రెజ్లర్లకు స్పోర్ట్స్ సెంటర్‌తో పాటు సురక్షిత ప్రాంతం అవసరమైంది. ఇరాన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు చొరవ తీసుకుని.. టెహ్రాన్‌కు ఉత్తరంగా 200 కిమీ దూరంలోని మజాందరన్‌లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంపై వైమానిక దాడులు పెద్దగా జరుగలేదు. ఓ వైపు యుద్ధోన్మాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా.. రెజ్లర్లు ఆటపై దష్టి నిలపటం అత్యంత సవాల్‌గా మారింది. మ్యాట్స్‌పై, మట్టిలోనూ సాధన చేసినా… టోర్నమెంట్‌లో పోటీపడేందుకు కర్గిస్తాన్ చేరుకోవటం మరో సమస్య. ఇరాన్ ప్రజలకు దుబారు విమానాశ్రయంలో అనుమతి ఇవ్వలేదు. దీంతో మజాందరన్ నుంచి రోడ్డు మార్గంలో దేశ సరిహద్దులు దాటిన రెజ్లర్లు అక్కడి నుంచి కిర్గిస్తాన్ చేరుకున్నారు.
పతక ప్రదర్శన
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇరాన్ రెజ్లర్లు… మానసిక, శారీరక సవాళ్లను అధిగమించి అద్భుతం చేశారు. యుద్ధంలో భవిష్యత్‌పై ఆశలు కోల్పోతున్న తమ దేశ ప్రజలకు విజయంతో కాసింత ఊరట కల్పించారు. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రెజ్లర్ అమీర్ హొస్సేన్ అబ్బాస్.. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గానూ నిలిచాడు. అయినా, ఈ మెడల్స్ ఏవీ ఇవ్వని సంతప్తి ఆసియా రెజ్లింగ్‌లో పసిడి పతకంతో కలిగిందని అన్నాడు. ‘ఇరాన్‌లో భద్రత ఎంతో కష్టమైంది. ట్రైనింగ్‌కు సురక్షిత ప్రదేశం కోసం ఎంతో శ్రమించాం. కానీ యుద్ధభీతిని మరిచి.. కుస్తీ సాధన చేయటమే ఓ సవాల్‌గా మారింది. కఠిన సమయంలో రెజ్లర్లు అందరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా.. దంగల్ చేయాలనే సంకల్పం తీసుకున్నాం. పసిడి పతకం సాధించిన తర్వాత ఇరాన్ జాతీయ జెండాతో నిలబడటం గొప్ప గర్వంగా అనిపించింది. మా దేశం పట్ల మా ప్రేమ, దేశభక్తి ఇదే’ అని అమీర్ హొస్సేన్ అబ్బాస్ అన్నాడు.
మా చరిత్రను చెరపలేరు
యుద్ధంలో క్రీడా స్టేడియాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాలపై దాడులు చేయకూడదు. అయినా, అమెరికా- ఇజ్రాయిల్ ఆజాదీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై దాడి చేసింది. స్పోర్ట్స్ స్టేడియం నేలమట్టం చేయాలనే ఆలోచన ఎందుకు చేశారో తెలియదని ఇరాన్ రెజ్లింగ్ కోచ్ అన్నాడు. ‘ఆజాదీ స్పోర్ట్స్ స్టేడియం ఇరాన్ రెజ్లర్లకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ స్టేడియంలో ఐదుసార్లు రెజ్లింగ్ ప్రపంచకప్ పోటీలు జరిగాయి. ఇక్కడ రెండు సార్లు ఇరాన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. స్టేడియంపై బాంబులతో దాడి మమ్మల్ని కుంగదీయలేదు. ఇక్కడే మళ్లీ స్టేడియం పున నిర్మిస్తాం. ఇక్కడే మళ్లీ రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తాం. క్రీడల్లో మా చర్రితను, మా మనోధైర్యాన్ని యుద్ధోన్మాదంతో చెరపలేరు’ అని అన్నాడు.



