నూతన అధ్యాపకులకు ఏహెచ్‌ఆర్‌ఏ, ఎస్‌సీఏ అలవెన్సులివ్వాలి

For new teachers AHRA and SCA allowance should be given– డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ కళాశాలల్లో నూతన అధ్యాపకులుగా చేరిన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకులకు అడిషనల్‌ హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (ఏహెచ్‌ఆర్‌ఏ), స్పెషల్‌ కంపెన్సెటరీ అలవెన్స్‌ (ఎస్‌సీఏ) ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లో డైరెక్టర్‌ ట్రెజరీని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ-475) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌తో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. మేలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు క్రమబద్ధీకరణ అయ్యారని వివరించారు. వారు ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకులకు కొన్ని జిల్లాల్లో కోశాధికారులు ఏజెన్సీ అలవెన్సులు చెల్లించడంలో ఇబ్బందులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రెజరీ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారనీ, అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో నూతన అధ్యాపకుల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని కోరుతూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల ఒకటి, రెండు తేదీల్లో పాఠశాల విద్య పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ ఉపాధ్యాయుల బదిలీలు అయ్యాయని తెలిపారు. వారు ఈనెల మూడు నుంచి ఎనిమిదో తేదీ మధ్య బదిలీ అయిన బడుల్లో చేరారని పేర్కొన్నారు. వారికి గతనెల 30 వరకు జీతం బదిలీకి ముందు పాఠశాలలో చెల్లించారని వివరించారు. వారికి చివరి జీతం సర్టిఫికెట్‌ గతనెల 30 వరకు చెల్లించినట్టు ఈనెల రెండు నుంచి ఏడురోజులపాటు జీతం చెల్లించలేదని నాన్‌ డ్రాయల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలిపారు. కొత్త చేరిన పాఠశాల డ్రాయింగ్‌ ఆఫీసర్‌ ఈనెల ఒకటి నుంచి బిల్లులు చేసేందుకు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ అనుకూలంగా లేదని పేర్కొన్నారు. కావున ఆ పోర్టల్‌లో తగు మార్పు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యనారాయణ, మల్లయ్య, బండి ప్రసాద్‌, అడపాల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love