నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సీపీఐ(ఎం) దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దమ్మపేటలోని సుందరయ్య భవన్లో జరిగిన కార్యక్రమానికి మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పిట్టల అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన వర్ధంతి సభలో మాజీ జిల్లా కమిటీ సభ్యుడు దొడ్డా లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు పిట్టల అర్జున్, మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి చారిత్రాత్మకమైందన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఐలమ్మ అన్యాయానికి ఎదురు నిలిచి ‘నా భూమి–నా హక్కు’ అంటూ పోరాడారని పేర్కొన్నారు.
జమీందారులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటానికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు అండగా నిలిచారని తెలిపారు. ఐలమ్మ భూమిని, అందులో పండిన పంటను ఆమె కుటుంబానికి దక్కేలా చేయడంలో పోరాట శక్తులు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విస్తరించిందన్నారు. సుమారు మూడు వేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు, మోరంపూడి కేశవరావు, కొలికిపోగు శ్రీనివాసరావు, సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, మోరంపూడి రామ్మోహన్రావు, నారపోగు అనిల్, ఎస్కే జాన్పాషా, యండ్రాతి సత్యనారాయణ, పెనుబల్లి సూర్యం, బసవా శ్రీనివాసరావు, కోమటి వెంకటేశ్వరరావు, మోటేపల్లి ధర్మయ్య, కే. గోపిరాజు, చీకటి వెంకటలక్ష్మీనారాయణ, టి. రమేష్, సీతారాములు, కారం వెంకటేశ్వరరావు, కూరం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



