Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంవిమానాశ్రయాలు పూర్తిగా ప్రయివేటుకే !

విమానాశ్రయాలు పూర్తిగా ప్రయివేటుకే !

- Advertisement -

అమ్మకానికి ఢిల్లీ, ముంబయి ఎయిర్‌‌పోర్టులోని మిగతా వాటాలు
ఎన్‌ఎంపీ 2.0 ప్లాన్‌‌లో విక్రయ యోచన

న్యూఢిల్లీ : దేశంలోని కీలకమైన రెండు విమానాశ్రయాలను ‌పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ), ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఉన్న మైనారిటీ వాటాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపీ) 2.0 పేరుతో ప్రజాధనంతో దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన విలువైన బ్రౌన్‌ఫీల్డ్ ఆస్తులను నగదీకరించి..ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ‌వీటిలోని వాటాలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఏల్‌), ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఏల్‌) సంస్థల్లో ఏఏఐకు 26 శాతం చొప్పున వాటా ఉంది. ఈ ప్రజా సంపదను ప్రయివేటు ప్లేస్‌మెంట్ విధానంలో బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టే ప్రక్రియను రానున్న నెలల్లో ప్రారంభించేందుకు అధికార వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల పేరుతో ముడిచమురు సరఫరాలో ఏర్పడిన అనిశ్చితి, పెరిగిన ఎరువుల సబ్సిడీ భారం వంటి ఆర్థిక లోపాలను సాకుగా చూపుతూ ప్రజల సంపదను అమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలని పాలకులు చూస్తున్నారు. ఎన్‌ఎంపీ 2.0 కింద ఏఏఐ అనుబంధ సంస్థతో పాటు నాలుగు సంయుక్త భాగస్వామ్య విమానాశ్రయాల్లోని ప్రభుత్వ వాటాలను తెగనమ్మాలని నిర్ణయించారు. దీని ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,800 కోట్లు, 2027-28లో రూ.2,950 కోట్ల మేర నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశ ప్రజల పన్నులతో, ప్రభుత్వ నిధులతో దశాబ్దాలుగా నిర్మించి అభివృద్ధి చేసిన ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పటికే జీఎంఆర్ గ్రూప్‌కు 64 శాతం, జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్ ఎజీకి 10 శాతం వాటా ఉండగా, ముంబయి విమానాశ్రయంలో అదానీ గ్రూప్ ఏకంగా 74 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఇప్పుడు ఏఏఐ వద్ద ఉన్న మిగిలిన 26 శాతం వాటాలను కూడా ప్రయివేటు పరం చేస్తే దేశ వ్యూహాత్మక గగనతల రవాణా రంగం పూర్తిగా కార్పొరేట్ల కనుసన్నల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023-24లో ఢిల్లీ విమానాశ్రయం 7.4 కోట్ల మందిని, 2024-25లో ముంబయి విమానాశ్రయం 5.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యాలకు చేర్చడం ద్వారా వేల కోట్ల రూపాయల ఆర్జనను కలిగి ఉన్నాయి. ఇంతటి లాభసాటి ప్రజా ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తున్నారనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగసంస్థలను బలోపేతం చేయాల ్సింది పోయి.. వాటిలోని వాటాలను అమ్ముకోవడం ద్వారా స్వల్పకాలిక ఆదాయం పొందాలని చూస్తున్న విధానం కార్మిక వర్గానికి, దేశ ఆర్థిక భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోంది. ఈ ప్రయివేటీకరణ ప్రక్రియ విజయవంతమైతే విమానాశ్రయ రంగంలో కార్పొరేట్ దోపిడీ మరింత పెరుగుతుందని.. భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కోల్పోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంపదను ప్రయి వేటు శక్తులకు ధారాదత్తం చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలని.. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడుకోవాలని ప్రజాస్వామిక వాదులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -