తెలుగు నాటక రంగ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నాటకాలు… వరవిక్రయము, చింతామణి. ఆ రెండూ తెలుగు వైభవం చాటే నాటకాలు. రెండూ కూడా చలన చిత్రాలుగా రూపొంది ప్రజాదరణ పొందడం విశేషం. వరవిక్రయము అప్పటి సాంఘిక దురాచరాన్ని ఎండగడితే ” చింతామణి” సజావుగా నడిచే జీవితం ఎలా నాశనం అయిపోవచ్చో అద్దం పడుతుంది. ఆ నాటకాలను రచించి తెలుగు వారి హృదయాలలో చిరకాలం నిలచి పోయారు కాళ్ళకూరి నారాయణరావు.
నారాయణ రావు కేవలం నాటక రచయిత మాత్రమే కాదు. బహుకళా ప్రపూర్ణులు. సంఘ సంస్కర్త, మొట్టమొదటి ప్రచురణ కర్త, హరికథకులు, కవి, నటులు, నాటకకర్త, పత్రికాధిపతి, మనోరంజని అనే పత్రికను నడిపారు. నాటి సమాజంలో ఉన్న దురాచారాలను ఎత్తి చూపించి, నాటకాలుగా మలచి, ప్రదర్శించడమే కాక, సంఘ సంస్కరణను ఆచరణలోనూ చూపించిన మహనీయుడు కాళ్ళకూరి నారాయణరావు. చక్కన్ని ఒరవడి, సంస్కారం, అధర్మాన్ని నిర్భయంగా ఎదుర్కునే శక్తి, ధైర్యం, సామాజిక స్పృహ, నైతిక విలువలపట్ల విశ్వాసం, బాధ్యతలు విస్మరించిన వారిని వెన్ను తట్టి లేపడం, సాంఘిక దురాచారాలపై ధ్వజం ఎత్తడం, ఇవన్ని కలిగలిపి రూపు దిద్దుకున్న వ్యక్తిత్వం కాళ్ళకూరి నారాయణ రావుది. ఆ కాలంలో కులాంతర వివాహం చేసుకోవడమంటే పెద్ద సాహసం. కళావంతురాలిని పెళ్లి చేసుకున్నారు. తనను కులం నుండి వెలివేసినా, లెక్కచేయని సాహసి, కవితారూప తపస్వి, బహు ప్రతిభా తేజస్వి. సంఘంలోని దురాచారాలను నాటకరాజాలుగా సృష్టించారు. చింతామణి, వరవిక్రయం, మధుసేవ మొదలైన ఆయన విరచిత నాటకాలు అజరామరమైనవి.
కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 – జూన్ 27, 1927) నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితులు.
ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరము మండలం, మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28 న బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మలకు జన్మించారు. అయన రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వాటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి. తెలుగు నాటక రంగంలో పది అత్యుత్తమ నాటకాలలో చింతామణి ఒకటి. ఆ నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. 1956లో పి.ఎస్. రామకృష్ణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రలుగా భరణి స్టూడియోస్ బ్యానర్ పై సినిమాగా నిర్మించారు. “చింతామణి ” నాటకం తెలుగు నాటక రంగాన్ని ఓ ఊపు ఊపింది. ఒక వ్యసనం వ్యక్తిని ఎంత హీన స్థితికి దిగజారుస్తుందో, పర్యవసానాలు ఎంత దారుణముగా ఉంటాయో ప్రతిబింబించారు. ఆ నాటకానికి కనీ వినీ ఎరుగని ఆదరణ లభించింది. ఆదాయానికి లోటులేకండా ఇంకా మరిన్ని నాటకాలు సమర్పించడానికి వీలుగా బోళ్ళు డబ్బు తెచ్చి పెట్టింది. చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి రచన ఈ నాటకం. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక సమాజమంటూ లేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు. ఆ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయవంతంగా ప్రదర్శిత మవుతోంది.
గురజాడ కాలంలో “కన్యాశుల్కం”, తరువాత “వరవిక్రయం” అంతటి ఘనత లభించింది. రెండూ తెలుగు నాటక రంగ ఇతిహాసంలో ఆణిముత్యాలే. కన్యాశుల్కం అప్పటి సాంఘిక దురాచారాన్ని ఎదుర్కుంటే, వర విక్రయం ఆ కాలం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ ఆ సాంఘిక దుస్థితిని ఎండకడుతూ వచ్చింది.
గురజాడ ” కన్యాశుల్కం” సాంఘిక దురాచారాలని ఖండిస్తూ, మార్పుకు అంకురార్పణ చేస్తే, కాళ్ళకూరి నారాయణరావు గారి సాంఘిక నాటకం – వరవిక్రయం (1921), అప్పటి సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ అనర్ధ హేతు చర్యలు వ్యతిరేకిస్తూ, సాంఘిక ధర్మానికి పాటుపడింది.
ఆ కాలంలోని సామాజిక సమస్యలకు తనదైన విచార ధారతో విశ్లేషించి, లోకం తీరును వరవిక్రయం రూపంలో మలిచారు. పెళ్ళి చేసుకోవడానికి భారీగా కట్న కానుకలు వసూలు చేస్తూ, వివాహం ఐదు రోజులు జరిపించుకొని, వైభవోపేతముగా సేవలు చేయించుకోవడం, పిల్ల తల్లి తండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టి వేయడం వంటి పరిస్థితులను ప్రతిఘటించడానికి, నైతిక భాద్యతలను నిర్వర్తించేందుకు పిలుపునిచ్చారు.
సి.పిల్లయ్య 1939 లో వరవిక్రయము సినిమా తీసారు. భానుమతి రామకృష్ణ ఆ సినిమాలో కాళింది గా నటించారు. ఈ చిత్రం ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. సింగరాజు లింగరాజుగా బలిజేపల్లి లక్ష్మికాంత కవి గారు వేశారు. “నటన అంటే అది” అని అనిపించు కున్నారు.
ఆయన రచనలలో… మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం మధుసేవ. అలాగే రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగ ధరునికీ, చిత్రాంగికీ నడుమ జరిగిన కథ చిత్రాభ్యుదయం. అంతేగాక పద్మ వ్యూహం (1919) , సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు ఆయన రచించారు. కాళ్ళకూరి 1919 లో రాసిన “పద్మవ్యూహం” నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందు పరిచారు.
ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ… కాళ్లూరి శిష్యులు కాగా, కొత్తె వెంకటాచారి నారాయణరావు… నాటకాల మీద పి.హెచ్.డీ చేశారు.
కాళ్లూరి 1927, జూన్ 27న మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494
అజరామరాలు…కాళ్ళకూరి నాటకాలు
- Advertisement -
- Advertisement -


