– కలెక్టర్ విపీ గౌతమ్
నవతెలంగాణ-ఖమ్మం
ఈనెల 9న నిర్వహించు గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ శిక్షణా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయన్నారు. గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరీక్ష నిర్వహణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించాలని, జిల్లాలో ఈనెల 9న జరుగనున్న గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 18 వేల 403 మంది అభ్యర్థుల కోసం 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కంటే ఒకరోజు ముందు రూట్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, పోలీస్ అధికారులు సంయుక్తంగా ప్రశ్నాపత్రాల తరలింపు రూట్ లను తనిఖీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఓఎంఆర్ షీట్ పై ముందు గానే అభ్యర్థి వివరాలు ప్రింట్ అయి వస్తాయని, వాటిని సంబంధిత అభ్యర్థులకే అందించేలా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రం ప్రాంగణంలో, అదే విధంగా భవనం వద్ద ఐడెంటిటీ అధికారులను నియమించాలని, ప్రతి అభ్యర్థిని పూర్తి స్థాయిలో చెక్ చేయాలని, మహిళలను పరిశీలించేందుకు మహిళా సిబ్బంది, ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. హాల్ టికెట్ పై ఫోటో సరిగ్గా లేకపోతే గెజిటెడ్ అధికారి లేదా అభ్యర్థి పూర్వపు విద్యాసంస్థచే ధ్రువీకరించిన లేటెస్ట్ ఫోటో అతికించి, 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రం ప్రాంగణంలోకి సెల్ ఫోన్ అనుమతి ఉండదని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి సైతం సెల్ ఫోన్ అనుమతి ఉండదన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా అవసరమైన మేర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని ఆయన అన్నారు. అభ్యర్థులు షూస్ వేసుకొని పరీక్షకు రావద్దని, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అన్నారు. 13 ఫ్లయింగ్ స్క్వాడ్, 52 మంది శాఖాధికారులు, 184 మంది గుర్తింపు అధికారులు నియమించినట్లు ఆయన అన్నారు. ఇన్విజిలేటర్ల హాళ్ళ కేటాయింపు పరీక్ష రోజు ఉదయం 9.30 గంటలకు లాటరీ ద్వారా చేపట్టాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రం ప్రవేశం, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, ఒక హాల్లో సిసి కెమెరాల ఏర్పాటుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు, విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ బాబు, ఎస్బీఐటి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్, కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.