ట్రక్ డ్రైవర్ల సమగ్ర ఆరోగ్యం, సంరక్షణ కార్యక్రమం‘సుశ్రుత’ను ప్రారంభించిన అమెజాన్

నవతెలంగాణ – హైదరాబాద్: అమెజాన్ ఇండియా నేడు ట్రక్ డ్రైవర్లకు సమగ్ర ఆరోగ్యం, సంరక్షణ కార్యక్రమం ‘సుశ్రుత’ను ప్రారంభించామని ప్రకటించింది. వేలాది ట్రక్ డ్రైవర్లకు ఉపాధి అవకాశాలను అందించే 350 మందికి పైగా ట్రక్కింగ్ భాగస్వాములతో అమెజాన్ కలిసి పని చేస్తుంది. తాము పని చేస్తూ, ఎక్కువ సమయం రహదారులపైనే గడిపే ఈ ట్రక్ డ్రైవర్‌ల ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యతనివ్వడమే ఈ చొరవ లక్ష్యం. అదనంగా, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య పద్ధతుల గురించి అవగాహన పెంచుతూ, ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ట్రక్ డ్రైవర్ల కోసం బెంగళూరు, మనేసర్ (హర్యానా), ముంబయి, మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో 70కి పైగా ఆరోగ్య పారామీటర్ల స్క్రీనింగ్‌తో వరుస ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ప్రేమాంష్ ఫౌండేషన్, ఆంచల్ హెల్త్ సెంటర్ మరియు డాక్‌ఆన్‌లైన్ వంటి ఎన్‌జీఓల సహకారంతో శిబిరాలను నిర్వహించగా, జనవరి 2024లో బెంగుళూరులో మొదటి శిబిరాన్ని, ఇటీవల మానేసర్‌లో చివరి శిబిరాన్ని నిర్వహించారు. డ్రైవర్ల నుంచి చక్కని ప్రోత్సాహం అందడంతో ఈ శిబిరాలు గణనీయంగా విజయాన్ని దక్కించుకున్నాయి.
భారతదేశంలోని అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ, “రోడ్డుపై ఎక్కువ గంటలు ఉండటంతో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ట్రక్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అమెజాన్‌లో మేము గుర్తించాము. ‘‘సుశ్రుత’’ కార్యక్రమం ఈ సవాళ్లను పరిష్కరించడంతో పాటు, డ్రైవర్ల ఆరోగ్యాన్ని చక్కగా ఉండేలా చూసుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పును తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు. సుశ్రుత కార్యక్రమం రక్త పరీక్షలు, కంటి మరియు దంత పరీక్షలతో సహా పలు రకాల స్క్రీనింగ్‌లను అందిస్తుంది. ట్రక్ డ్రైవర్‌లలో ఏవైనా ఆరోగ్య సమస్యలను గుర్తించి, నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, శిబిరంలో ఆరోగ్య జాగృతి ప్రచారాలు, సెషన్‌లు నిర్వహించారు. ఇది ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించారు. డ్రైవర్‌లకు వారి ఆరోగ్య నివేదికలతో పాటు రెఫరల్ కార్డ్ అందించారు. వారితో పాటు వారి  ముగ్గురు కుటుంబ సభ్యులకు టెలికన్సల్టేషన్ సేవలను అందుకునేందుకు అవకాశం కల్పించారు. అదనంగా, రెఫరల్ కార్డ్ ఏడాది పొడవునా ఆరోగ్య పరీక్షల కోసం ఆంచల్ హెల్త్ సెంటర్ మరియు అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.
బెంగుళూరు నుంచి అమెజాన్ ట్రక్కింగ్ భాగస్వామితో కలిసి పనిచేస్తున్న ట్రక్కు డ్రైవర్ జి.తిప్పరాజు మాట్లాడుతూ “సుశ్రుత వంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అమెజాన్‌కు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. మేము ఎక్కువగా ప్రయాణంలో ఉండడంతో అమెజాన్ మా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మా అభివృద్ధి కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందనే భరోసా ఇచ్చింది’’ అని తెలిపారు. అమెజాన్ 2022లో లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం పైలట్‌ను నేత్ర పరీక్షల శిబిరంతో ప్రారంభించింది. ఈ శిబిరం 25-రోజుల పాటు కొనసాగగా, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని పూర్తి కేంద్రాలు, క్రమబద్ధీకరణ కేంద్రాలకు విస్తరించి, ట్రక్ డ్రైవర్లు, సహాయక సిబ్బందికి కంటి సంరక్షణ సౌలభ్యాన్ని మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ 1700 మందికి పైగా వ్యక్తులకు పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి 529 కన్నా ఎక్కువ కళ్లజోళ్లను పంపిణీ చేసింది. విజయవంతమైన పైలట్‌ కార్యక్రమాన్ని అనుసరించి, అమెజాన్ ఈ ఏడాది ‘సుశ్రుత’లో భాగంగా ఆరోగ్య సంరక్షణ శిబిరాన్ని, చెకప్‌లు,  పరీక్షల పరిధిని విస్తరించింది.

Spread the love