Tuesday, June 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌కు లొంగటం తప్ప, అమెరికాకు మరో మార్గం లేదు

ఇరాన్‌కు లొంగటం తప్ప, అమెరికాకు మరో మార్గం లేదు

- Advertisement -

మూడు నెలల యుద్ధం, బిలియన్ల డాలర్ల వ్యయం, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభ అంచుల వరకు నెట్టిన ఉద్రిక్తతల తర్వాత అమెరికా చివరకు ఇరాన్‌తో రాజీకి రావాల్సి వచ్చింది. ఇరాన్‌ను మోకాళ్లపై నిలబెడతామని ప్రగల్భాలు పలికిన ట్రంప్ ప్రభుత్వం తను ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటీ సాధించలేదు. ఇది అమెరికా ఆధిపత్య రాజకీయాలకు ఎదురు దెబ్బ. కాగా బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ ఆవిర్భావానికి ఒక సంకేతం. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం.
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై మూడు మాసాలుగా సాగిస్తున్న అక్రమ యుద్ధానికి తెరపడి, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరింది. పద్నాలుగు అంశాలతో ఉన్న అవగాహనా పత్రంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజిస్కియాన్ ఇరువురూ ‘ఆన్‌లైన్‌’ సంతకాలు చేసారు. ఉభయ దేశాలు భౌతికంగా స్విట్జర్లాండ్‌లో సమావేశమై సంతకాలు చేయటానికి జూన్ పందొమ్మిది అని తేదీని కూడా నిర్ణయించారు. అమెరికా తన బ్లాకేడ్ విరమించాలని, ఇరాన్ ‘హార్ముజ్ జలసంధి’ని తెరవాలని, అరవై రోజుల వ్యవధిలో మిగతా అంశాలపై చర్చించి తుది ఒప్పందానికి రావాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇది మనందరం ఆహ్వానించదగిన పరిణామం. ఇక దీంతో ఆయిల్ కష్టాలు తీరినట్టే అని అందరూ భావించారు.

అయితే ఒప్పందంలో లెబనాన్‌తో సహా అన్ని చోట్లా యుద్ధాన్ని వెంటనే ఆపేయాలనేది, ఇది వెంటనే అమలు జరగాల్సిన ముఖ్యమైన షరతు. అయినప్పటికీ మరుసటిరోజే ఇజ్రాయిల్ లెబనాన్‌పై బాంబుదాడులు చేసి యాభై మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకుంది. ఇజ్రాయిల్ ప్రభుత్వం, కొందరు మంత్రులు అమెరికా ఒప్పందంతో మాకేం సంబంధం లేదు. ఇరాన్‌ను నాశనం చేసి తీరుతాం అంటూ ప్రకటనలు కూడా గుప్పించారు. దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తెరవబడిన ‘హార్ముజ్’ జలసంధిని ఇరాన్ తిరిగి మూసేసింది. ఈ లోపుగా అమెరికా అధ్యక్షులు ట్రంప్, ఉపాధ్యక్షులు వాన్స్ ఇజ్రాయిల్‌‌పై వత్తిడి పెంచి, బహిరంగంగా హెచ్చరించిన ఫలితంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై దాడులను విరమించటం, మళ్లీ ‘హర్మోజ్ జలసంధిని తెరచి నౌకల రాకపోకలను అమతించటం జరిగి, ఇరు పక్షాల మద్య చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చలు ప్రారంభమైనా ట్రంప్ ‘వాచాలత్వం’ మాత్రం ఆగలేదు. లెబనాన్‌లో ‘హెజ్బుల్లా’ గెరిల్లాలతో ఇరాన్ సంబంధాలు వదులుకోవాలని లేనట్లయితే ఇరాన్‌పైన మళ్లీ బాంబులు వేస్తానని ట్రంప్ బాహాటంగా ఇరాన్‌ను బెదిరించాడు. ‘హార్ముజ్‌ను నేనే తెరిపించి, టోల్ వసూలు చేస్తాన’ని కూడా ప్రకటించాడు.ఈ పరిణామంతో ఇరాన్ ప్రతినిధివర్గానికి చిర్రెత్తుకొచ్చి, అమెరికా ప్రతినిధులతో ‘‌ఫొటో’ దిగటానికి కూడా నిరాకరించి వెళ్లిపోయారు.

మరోవైపు గతంలో ఒబామా కాలంలో ఇరాన్ చేసిన ఒప్పందాన్ని కాలదన్ని, మూడు మాసాల పాటు యుద్ధం చేసి, బిలియన్‌ల డాలర్లు ఖర్చు చేసి ఇపుడు ఈ ఒప్పందం ద్వారా ట్రంప్ సాధించిం దేమిటి? అనే విమర్శలు అమెరికా అంతటా వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇరాన్‌లో కూడా ఈ ఒప్పందాన్ని అత్యధికులు బలపరు స్తున్నా, ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ అణ్వా యుధం తయారు చేసుకునే హక్కు కోల్పోతోందని వ్యతిరేక ప్రదర్శనలు కూడా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య అసలు ఈ ఒప్పందం జరుగుతుందా? జరిగినా అమలు జరుగుతుందా? అనే సందేహాలు అనేకమందిలో కలుగుతున్నాయి.
కానీ తాత్కాలిక ఒడిదుడుకులు ఎదురైనా ఈ ఒప్పందాన్ని ఒప్పు కోవటం, దాన్ని ని అమలుజేయ ప్రయత్నించటం తప్ప అగ్రరాజ్యం అమెరి కాకు మరోదారి లేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ రాజీ, అమెరికా-ఇరాన్‌లు రెండూ యుద్ధంలో అలసిపోయినందువల్ల జరుగుతున్నది కాదు. ఇరాన్‌ను నాశనం చేయాలని అన్ని విధాలా ప్రయత్నించి, అది సాధ్యంకాక అమెరికా లొంగిపోతున్న సందర్భం. యుద్ధం ప్రారంభం కాకముందు అమెరికా చేసిన ప్రగల్భాలలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ఇరాన్‌లో పాలన మార్చటం, ఇరాన్ అణు ఇంధనాన్ని స్వాధీనం చేసుకోవటం, గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బుల్లా, ఎర్ర సముద్రమార్గంలో హౌతీలకు ఇరాన్ మద్దతు లేకుండా చేయటం, ఇరాన్ ఖండాతర క్షిపణులను నాశనం చేయటం, చివరకు ఇరాన్ మూసేసిన హార్ముజ్ జలసంధిని తెరిపించటం తమ లక్ష్యాలు అంటూ, ట్రంప్‌తో సహా అనేకమంది ఆయన వందిమాగధులు ఘనంగా పదే పదే ప్రకటించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని, లేదంటే వాళ్ల నాగరికతనే నాశనం చేస్తామన్నారు. ఇరాన్ దేశాన్ని తన దాడుల ద్వారా చాలా నష్టపరిచినా ఈ లక్ష్యాలలో ఏ ఒక్కటీ సాధించలేక పోగా అమెరికా ఇరాన్ ముందు సాగిలపడి తానే లొంగి పోవాల్సి వచ్చింది. ఇరాన్ ప్రతిపాదించిన షరతులన్నింటినీ ఒప్పుకోక తప్పని పరిస్థితి అమెరికాకు ఏర్పడినందువల్లనే ఈ రాజీ ఒప్పందం ముందుకు వచ్చింది.
ఈ స్థితిలో ఇపుడు ఈ ఒప్పందాన్ని వదులుకొని అమెరికా ఏం చేయగలదు? తిరిగి యు‌ద్ధం మొదలు పెడుతుందా? అంత శక్తే దానికుంటే అసలు రాజీకి వచ్చి ఉండేదేకాదు గదా! ఈ యుద్ధం వల్ల హార్ముజ్‌ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు నిలిచిపోవటంతో ప్రపంచం అంతా ‘ఆర్థిక సంక్షోభం’ అంచున నిలిచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు వీటి కారణంగా ఇతర సరుకుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.
అమెరికాలో కూడా ధరల పెరుగుదల, యుద్ధానికి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. రెండు డాలర్లున్న గ్యాలన్ గ్యాస్ ధర నాలుగు డాలర్లకు పైగా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచం అర్ధిక వ్యవస్థ సంక్షోభానికి గురై దశాబ్దాల పాటు తిరోగమనం పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నవంబర్‌లో అమెరికాలో మధ్యం తర ఎన్నికలు జరగబోతున్నాయి. ట్రంప్ పిచ్చిచేష్టలు, ఈ యుద్ధమూ, అనేక దేశాలపై టారిఫ్‌ల తతంగమూ వగైరా పరిణామాలతో రిపబ్లికన్లు చిత్తుగా ఓడిపోయే పరిస్థితే ఉంది. అందువల్ల ఇపుడు ట్రంప్‌కుగానీ, అమెరికాకు గానీ ఈ ఒప్పందం ద్వారా ‘గుడ్డిలో మెల్ల’లాగా బయట పడటం తప్ప వేరే మార్గం లేదు.

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు ఏర్పడిన ఈ దుస్థితితో పాటు, ప్రపంచంలో అంతర్లీనంగా మరో మంచి మార్పు ప్రారంభమౌతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాచీ ఇటీవల మాస్కో పర్యటించి అధ్యక్షుడు పుతిన్‌తో గంటన్నర చర్చలు జరిపాడు. తర్వాత చైనా వెళ్లి విదేశాంగ మంత్రి వాంగ్ యీ తో చర్చలు జరిపాడు. తరువాత ఆయన టెహ్రాన్(ఇరాన్ రాజధాని)లో ఒక ప్రకటన చేసాడు. దాని సారాంశమేమంటే యుద్ధానం తరం ‘మధ్య ప్రాచ్యం భవిష్యత్తు’ ఎలా ఉండాలనేది తాము చర్చిస్తున్నా మన్నాడు. అంటే ఇప్పటి వరకూ గల్ఫ్ దేశాలన్నీ (సౌదీ అరేబియా, యు.ఎ.ఇ, బహ్రెయిన్, ఖతార్, కువైట్ వగైరా దేశాలు) అమెరికా మిత్రదేశాలుగా దాని ప్రభావంలో ఉండేవి. ఈ ప్రాంతంలో తొమ్మిది దేశాల్లో అమెరికా మిలటరీ స్థావరాలు పందొమ్మిది ఉన్నాయి. ఇపుడు ఇరాన్ ఒప్పందంలో భాగంగా ఈ స్థావరాలన్నిటినీ అమెరికా క్రమంగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సౌదీ, యు.ఎ.ఇ, ఖతార్ దేశాలు ఇరాన్‌కు సన్నిహితం కావాటానికి చర్చలు ప్రారంభించాయి. మిగతా దేశాలకూ అదే దారి తప్పదు. ఆ విధంగా ప్రపంచంలో భౌగోళికంగా అతి కీలకమైన పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ ఒక సూపర్ పవర్‌గా ఆవిర్బవించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. 1990లలో సోవియట్ పతనం తర్వాత ఏర్పడిన ఏక ధృవ ప్రపంచం (అమెరికా ఏకపక్ష ప్రపంచ నాయకత్వం) బద్దలై బహుళ ధృవ ప్రపంచం (అన్ని దేశాలు సర్వస్వతంత్రంగా మనుగడ సాగించే వ్యవస్థ) ఆవిర్భావానికి ఈ విధంగా అంకురార్పణ జరుగుతోందని చెప్పవచ్చు. బ్రిక్స్, షాంఘై కో ఆపరేటివ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పరిణామాలకు నాయకత్వం వహిస్తున్నాయి. చైనా, రష్యాలు ఈ కృషిలో ముందు పీఠిన నిలుస్తున్నాయి. వామపక్షశక్తులు, అభ్యుదయ వాదులు, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి పోరాడే శక్తులన్నీ ఈ పరిణామాలను హర్షించాలి. కానీ బ్రిక్స్ కూటమి సభ్యురాలైన (ప్రస్తుతం దానిఅధ్యక్ష స్థానంలో కూడా ఉన్న) ఇండియా మాత్రం నిస్సిగ్గుగా ఈ యుద్ధంలో ఇజ్రాయిల్‌నే బలపర్చటం దుర దృష్టకరం. ఇరాన్ సుప్రీం లీడర్ ‘ఖొమైనీ’ సహా 42 మందిని కుట్ర పూరితంగా హత్యలు చేసిన ఇజ్రాయిల్ ఘాతుకంపైన కనీసం వెంటనే సంతాపం కూడా ప్రకటించకపోవటం, భారత్ నావికులు ముగ్గురిని అమెరికా క్షిపణి దాడిలో మట్టుబెట్టినా మౌనం వహించటం, అమెరికా ఇండో ఫసిపిక్ కమాండ్ పేరులో ఇండో తీసివేసినా, ఆ కమాండ్ ఏరియా పటంలో పి.వొ.కె(పాక్ ఆక్రమిత కాశ్మీర్)ను పాకిస్తాన్ భూభాగంలో చూపటం లాంటి చర్యలకు అమెరికా పాల్పడినా ఇండియా స్పందించకపోవటం మన దేశ దౌత్యనీతి దుస్థితికి అద్దం పడుతున్నాయి.

పైపెచ్చు సుంకాల ఒప్పందం ద్వారా మన వ్యవసాయరంగాన్ని, ఇతర చిన్న పరిశ్రమలను కబళించటానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అపుడపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌,మోడీ తనకు ఆప్తమిత్రుడని పొగడ్తలు గుప్పిస్తే సంబరపడిపోవటం తప్ప మన ప్రభుత్వానికిగానీ, మోడీకి గానీ ఈ విషయాలు తలకెక్కటం లేదు. ఇరాన్ యు‌ద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఓడిపోవటమేగాదు. ఈ కాలంలో దౌత్యనీతి (విదేశాంగ విధానం)లో మనదేశమూ ఓడిపో తోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వంపై మనం వత్తిడి తేవాల్సి ఉంటుంది.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -