Tuesday, June 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘హిందూ రాజ్యం’ అంటే?

‘హిందూ రాజ్యం’ అంటే?

- Advertisement -

ఇండియాలో హిందూ రాజ్యాన్ని (‘హిందూ రాష్ట్ర’) స్థాపించడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) లక్ష్యం. అయితే ఈ హిందూ రాజ్యం అంటే ఏమిటి? ప్రస్తుతం పౌరులందరికీ, వారి వారి మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా సమానత్వాన్ని గ్యారంటీ చేస్తోంది రాజ్యాంగం. దానికి బదులు, హిందువులకు ఎక్కువ స్థాయిని కల్పిస్తూ తక్కిన మతాల ప్రజలకు తక్కువ స్థాయిని కల్పించేదే హిందూ రాజ్యం అని వెంటనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా ఆ హిందూ రాజ్యంలో దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మైనారిటీలు ‘ముస్లింలు’ హిందువులకన్నా దిగువ స్థాయిలో ఉంటారు. ప్రత్యేకమైన అణచివేత స్వభావం కలిగిన రాజ్య వ్యవస్థ లేకుండా ఇటువంటి అసమానతను ఆచరించడం సాధ్యం కాదు. నిజానికి వర్గాధిపత్యం చెలాయించే సమాజాలన్నీ అణచివేత స్వభావంతోనే ఉంటాయి. కాని ఇలా అసమానతను వ్యవస్థీకతం చేసే రాజ్యం కొనసాగా లంటే అందులో అణచివేత స్వభావం మరింత ప్రత్యేకమైన తీవ్రత కలిగి వుండాలి. అటువంటి హిందూ రాజ్యం అంటే హిందువు లందరూ తక్కిన మతాల ప్రజల మీద నియంతత్వాన్ని ఉమ్మడిగా చెలాయించే వీలుంటుందా?

ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం ‘ఉండదు’ అనే వస్తుంది. ఒక రిక్షా కార్మికుడు, అతడి మతం ఏదైనప్పటికీ, హిందూ రాజ్యంలో కూడా రిక్షా కార్మికుడిగానే కొనసాగుతాడు. ఒక ప్యూన్ హిందూ రాజ్యంలో కూడా ప్యూన్‌గానే ఉంటాడు, అతడు హిందువైనా, ముస్లిం అయినా. ఒక గిగ్ వర్కర్ అదే విధంగా గిగ్ వర్కర్ గానే ఉంటాడు. ఈ ‘హిందూ రాజ్యం’ అన్నది మెజారిటీ హిందువుల భౌతిక, వాస్తవ జీవిత పరిస్థితులను ఏ విధంగానూ మార్చదు. మరి, అటువంటప్పుడు, ఈ తరహా నియం‌తృత్వ స్వభావంతో ఉండే రాజ్యం ఎవరి ప్రయోజనాల కోసం నియంతృత్వాన్ని చెలాయిస్తుంది? గుత్త పెట్టుబడిదారీవర్గ ప్రయోజనాల కోసమన్న సమాధానం వెంటనే స్ఫురిస్తుంది. హిందూ రాజ్యం అంటే, దాని పేరు సూచించే విధంగా కాకుండా, వాస్తవానికి గుత్తపెట్టుబడిదారీ వర్గ నియంతత్వమే.
హిందూ రాజ్యంలో హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను అధికారిక కార్యక్రమాల సందర్భంగా పాటించడం జరుగుతుంది. ఉద్యోగాల ఎంపికలో తక్కిన మతాల వారికన్నా హిందువలకు ఇప్పటికన్నా ఎక్కువ ప్రాధాన్యతని స్తారు. అయితే, ఇప్పుడు కొత్త ఉద్యోగాలేవీ లేనట్టే, హిందూ రాజ్యంలో కూడా అదనంగా, కొత్త ఉద్యోగాలు ఏవీ ఉండవు. నిజానికి ఇప్పటికన్నా ఎక్కువ మోతాదులో ఉన్న ఉద్యోగాలు అదృశ్యమైపోతాయి. ఎందుకంటే కార్పొరేట్లు ఎ.ఐ ని ప్రవేశపెడుతున్నారు. ముస్లింలు, ఇతర మైనారిటీలు బహు విధాలుగా తీవ్రమైన అణచివేతను ఎదుర్కొనవలసి వస్తుంది. అదే సమయంలో హిందువుల మీద ప్రస్తుతం సాగుతున్న అణచివేత నుంచి వారికి ఎటువంటి ఊరటా లభించదు. గుత్త పెట్టుబడిదారీ వర్గం బ్రహ్మాండంగా బలపడుతుంది. వాళ్లలో కూడా ఒక కొత్త గ్రూపు మరింత ఎక్కువ బలపడుతుంది. అంటే హిందూ రాజ్యంలో భారతీయ బడా కార్పొరేట్ల పెత్తనం బాగా పెరుగుతుంది. అందులో అదానీ, అంబానీల పెత్తనం మరింత ఎక్కువ బలపడుతుంది.

ఇది 1930ల నాటి జర్మనీ పరిస్థితిని తలపిస్తోంది. ఆర్యేతర ప్రజా సమూహాలను అణచివేయడం ద్వారా ‘ఆర్య జాతి ఆధిక్యత’ను స్థాపించడం తమ లక్ష్యం అని నాజీలు ప్రకటించారు. వాళ్ళ దష్టిలో అక్కడ ఉండే యూదులు, జిప్సీలు (సంచార జాతులు) ఆర్య జాతికి చెంది వుండే అవకాశమే లేదు! అయితే, అక్కడ వాస్తవానికి ఏర్పడిన ఆర్య రాజ్యం స్వభావం ఏమిటి? అది “అత్యంత ప్రతీఘాత స్వభావం కలిగిన, అత్యంత విద్వేషపూరితమైన, ఫైనాన్స్ పెట్టుబడిలోని అత్యంత సామ్రాజ్యవాద దురాక్రమణ కాంక్ష కలిగిన శక్తులు బహిరంగ భయోత్పాత చర్యలతో చెలాయించే నియంతృత్వం” అని జార్జి డిమిట్రోవ్ అన్నాడు. 1935లో జరిగిన కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏడో మహాసభలో దాని అధ్యక్షుడిగా ఆయనపై నిర్వచనాన్ని ప్రతిపాదించాడు.
రాజ్య వ్యవస్థ మీద పెత్తనం చేసే శక్తులు తమ రాజ్యాన్ని ఏ విధంగా వర్ణిస్తాయో, ఆ విధంగా వాస్తవానికి ఆ రాజ్య వ్యవస్థ వ్యవహరించదు. ఆ రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని ఏ వర్గం తన స్వంత ప్రయోజనాలను నెరవేర్చు కోజూస్తోంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడే కాదు, వర్తమాన ప్రపంచంలో మైనారిటీలుగా ఉండే జాతులనో, మైనారిటీ మతాల వారినో, మైనారిటీ భాషల ప్రజలనో తాము లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నా మని, వారిని రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తామని చెప్పుకునే ఏ రాజ్యంలోనైనా, నిజానికి వాళ్లు గుత్త పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను మాత్రమే నెర వేరుస్తున్నారు. అందు కోసం నియంతృత్వ పాలన ప్రవేశపెడుతున్నారు. అందుకోసమే జాతి, మత, భాషాపరమైన తేడాలను రెచ్చగొట్టి శ్రామిక ప్రజలను చీల్చుతున్నారు. ప్రజానీకంలో కొన్ని తరగతుల వారిపై నియం తృత్వం నెరపుతామనే పేరుతో తీసుకువచ్చే ఏ రాజమైనా వాస్తవంలో గుత్త పెట్టుబడిదారీ వర్గ నియంతృత్వాన్ని చెలాయించడం కోసమే అలా చేస్తుంది.

ఇప్పుడు “లౌకిక” రాజ్యంగా చెప్పుకునే ప్రస్తుత రాజ్య వ్యవస్థ కూడా గుత్త పెట్టుబడిదారుల పెత్తనం కిందే నడుస్తోంది కదా? అటువంటప్పుడు మళ్లీ ఒక కొత్త రూపంలో, హిందూ ఆధిక్యత పేరుతో, విభిన్నమైన రీతిలో నియంతృత్వాన్ని ఎందుకు తేవాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్య వ్యవస్థ ఇప్పటిదాకా కొనసాగిన రూపం తీవ్రమైన సవాలును ఎదుర్కొ న్నప్పుడే, అలా కొనసాగడం కష్టతరమౌతున్న ప్పుడే, ఇటువంటి ఒక కొత్త రూపంలో నియంతత్వాన్ని తీసుకురావలసిన అవశ్యకత కలుగుతుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుపోతోంది. నిరుద్యోగం విపరీ తంగా పెరుగుతోంది. ఈ మాంద్యానికి కారణం గుత్త పెట్టుబడిదారీ వర్గ ఆధిపత్యంలో రాజ్యం అమలు చేసిన నయా ఉదారవాద విధానాలే. ఆ విధానాలు ఇదే మాదిరిగా ఇక ముందు కొనసాగడం సాధ్యం కావడం లేదు. ముందు దారి మూసుకుపోయింది. పైగా ఆ విధానాల వల్లే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. అత్యధిక ప్రజానీకం దుర్భరమై పేదరికంలో కూరుకుపోతున్నారు.
శ్రామిక ప్రజలు ప్రతిఘటించడానికి, పోరాడడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే సంక్షోభ పరిస్థితి తలెత్తినప్పుడు పాలకవర్గాలు ప్రజాస్వామ్యాన్ని కుదించివేయడానికి ప్రయత్ని స్తాయి. తద్వారా గుత్త పెట్టుబడిదారీ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి చూస్తాయి. అయితే, ఆ సంక్షోభం దీర్ఘకాలంగా కొనసాగుతున్నప్పుడు, తన ఆధిపత్యానికి ముప్పు పెరుగుతున్నప్పుడు, గుత్త పెట్టుబడిదారీ వర్గం మరింత తీవ్ర చర్యలకు పూనుకుంటుంది. ప్రజానీకాన్ని చీల్చి బలహీనపరచడంలో ఎక్కువ సామర్ధ్యంగల శక్తులతో అది జత కడుతుంది. తద్వారా ప్రజల మధ్య చర్చను పక్కదోవలకు మళ్లిస్తుంది. శ్రామిక ప్రజానీకం ఐక్యంగా ప్రతిఘటనకు పూనుకుంటున్నప్పుడు ‘హిందూ రాజ్య స్థాపన’ పేరుతో విద్వేషపూరిత భావనను ముందుకు తెస్తుంది.

ఇప్పుడు ఆరెస్సెస్ ‘బీజేపీ ముందుకు తెస్తున్న చర్చ ప్రజానీకపు దృష్టిని ఏ విధంగా పక్కదోవ పట్టిస్తున్నదీ మనకు స్పష్టంగా తెలుస్తూనే వుంది. దేశంలోని శ్రామిక ప్రజలు, ముఖ్యంగా యువత నిరుద్యోగంతో కుంగి పోతున్నప్పుడు, అందునా చదువుకున్న వారిలో నిరుద్యోగం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ తీవ్ర సమస్య గురించి పాలకులు ఒక్క ముక్క కూడా మాట్లా డడం లేదు. కాని బంగ్లాదేశ్ నుండి ‘చొరబాటుదారులు’ వచ్చేస్తున్నారంటూ గొంతులు చించుకుంటున్నారు.
ఒకానొక దేశపు జీడీపీ వృద్ధి అనేదే ఆ దేశ పురోగతికి ప్రమాణం అని బీజేపీ వాదిస్తూ వుంటుంది. ఆ ప్రకారమే చూసినప్పుడు బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం భారతదేశపు తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఎక్కువ ఆదాయం వచ్చే బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి ప్రజలు తక్కువ ఆదాయం వచ్చే ఇండియాలోకి ఎందుకు ‘చొరబడు తున్నారో’ బీజేపీ వివరించగలదా? ఇండియాలో హిందూత్వ శక్తులు ఎందుకు ముందుకు తోసుకు వస్తున్నాయో వివరించడానికి ఉదారవాద మేథావులు చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాని ఈ హిందూత్వ అనేది ప్రపంచవ్యాప్తంగా నయా ఫాసిజం పెరుగుతున్న క్రమంలో అంతర్భాగ మేనన్న వాస్తవాన్ని వాళ్లు గుర్తించడం లేదు. ఇదేదో కేవలం ఇండియాకు సంబంధించినదే అనుకుంటున్నం తవరకూ దీని స్వభావం అర్ధం కాదు. గుత్త పెట్టుబడిదారీ వర్గం నయా ఫాసిస్టు శక్తులకు ఆర్థికంగా, మీడియా పరంగా పూర్తి తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ విధంగా పెట్టుబడిదారీ ప్రపంచంలో చాలా దేశాల్లో సాగుతోంది. అర్జెంటినా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో ఇది చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు దారి లేకుండా మూసుకుపోయే దశకు నెట్టిన నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానమే దీనికి కారణం.

ఈ మధ్యనే ఆరెస్సెస్ వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంది. గత వందేళ్లుగా అది అధికారానికి చేరువగా ఎన్నడూ లేదు. ఇప్పుడు ఒక్కసారి అది “ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీ” తమ వద్ద ఉందని చెప్పుకుంటోంది. దీనికి కారణం గుత్త పెట్టుబడిదారీ వర్గం నుంచి ప్రస్తుతం దానికి బ్రహ్మాండమైన స్థాయిలో మద్దతు అందుతూ వుండడమే.
గుత్త పెట్టుబడిదారీ వర్గం హిందూత్వ పట్ల అంతకు ముందు ఉండిన వైఖరిని మార్చుకుని దానితో జత కట్టడం అన్నది మాత్రమే కాదు మనం చూడవలసినది. ఇక్కడ హిందూత్వ శక్తులు కూడా గుత్త పెట్టుబడిదారీ వర్గం పట్ల తమ వైఖరిని మార్చుకున్నాయి. కాని, దానికి ప్రధానమైన మద్దతు సాంప్రదాయంగా చిన్న వ్యాపార వర్గాల వారి నుంచి, చిన్న పెట్టుబడిదారుల నుంచి, పట్టణ మధ్యతరగతి నుంచి లభించేది. ఆరెస్సెస్ ఎన్నడూ గుత్త పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగని అది ప్రత్యేకంగా గుత్త పెట్టుబడిదారీ వర్గం కోసం కూడా గతంలో మాట్లాడినది లేదు. అయితే ఆర్థిక విధానాల మీద చర్చ అన్నది హిందూత్వ శక్తులకు ఎప్పుడూ అంత ప్రధానంగా లేదు. జర్మనీలో నాజీలు అధికారంలోకి వచ్చే వరకూ గుత్త పెట్టుబడిదారీ వర్గాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు. అధికారం వచ్చాక వారి తీరు మారింది. అచ్చంగా అలాగే కాకపోయినా ఇక్కడ హిందూత్వ శక్తుల వైఖరిలో కూడా అటువంటి మార్పే మనం చూస్తాం.

ఈ మార్పు వెనుక నరేంద్ర మోడీ పాత్ర ప్రధానం. కార్పొరేట్ -హిందూత్వ కూటమి రూపొం దడం వెనుక సూత్రధారిగా పోషించిన పాత్ర వల్లే హిందూత్వ వర్గాల్లో మోడీ ప్రాధాన్యత అంతగా పెరిగింది. నిజానికి గుజరాత్‌లో భారతీయ పెట్టుబడి దారుల ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగినప్ప టికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమావేశం లోనే మోడీ భావి ప్రధాని కావాలన్న ప్రతిపాదన రూపొందింది. అప్పటి నుంచీ మోడీ ఏమాత్రమూ వెరపులేని విధంగా గుత్త పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ము కాస్తూనే వున్నారు. భారతదేశ గుత్తపెట్టుబడి దారీ వర్గం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో సమ్మిళితం అయిపోవడంతో మోడీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి కూడా నమ్మిన బంటు అయిపోయారు. తన నయా ఫాసిస్టు ఎజెండాతో మోడీ ఇప్పుడు గుత్తపెట్టుబడిదారీ వర్గానికి చాలా ఉపయోగపడే సాధనంగా ఉన్నాడు.

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -